‘‘అమ్మా! నీకు రంజని గురించి చెప్పానే.. ఆ అమ్మాయే ఈమె’’ అన్నాడు ఆనంద్.రంజని మెల్లగా కనురెప్పలు పైకెత్తి చూసింది. ఎదురుగా కాబోయే మామగారు కనిపించారు. ఆయన కనుబొమలు పైకెత్తి తీక్షణంగా చూస్తున్న తీరు గమనిస్తే తమ పెళ్ళికి ఒప్పుకునే మనిషిలా లేడు.మొత్తానికి కొద్దిమంది బంధుమిత్రుల మధ్య వడపళని గుడిలో వారి వివాహం అతి సాధారణంగా జరిగింది.
మామగారు అమ్మాయి తండ్రితో మాట కూడా మాట్లాడలేదు. వారం తర్వాత, పెట్టిన సెలవు పూర్తి కావడంతో రంజని ఉద్యోగం చేసే చోటుకు వెళ్ళిపోవడానికి సిద్ధమైంది.‘‘ఏరా అబ్బాయ్ అమ్మాయి వెళ్ళిపోతోందా?’’ అడిగింది తల్లి కొడుకును.‘‘అవునమ్మా కాలేజికి వెళ్ళాలి కదా మరి?’’ అన్నాడు ఆనంద్.తల్లికి ఎందుకో ఆమాట రుచించలేదు. భర్త కోసం, కొడుకు కోసం ఎదురు చూడడంతో జీవితమంతా గడిచిపోయింది. ఇక ఇప్పుడు కోడలి కోసం కూడా ఎదురు చూస్తూ ఉండాలా? అనుకుంది.ఓ సారి సెలవుల్లో ఇంటికొచ్చిన కోడలితో రుక్మిణి మెల్లగా విషయం కదిలించింది, ‘‘ఏమ్మా రంజనీ! ఎందుకొచ్చిన ఉద్యోగాలమ్మా ఇవీ! మరో నాలుగైదు నెలల్లో బాబును కనబోతున్నావు. అప్పుడు నీకిక తీరికే ఉండదు. నాకిక విశ్రాంతే అక్కరలేదా తల్లీ? ఉన్న ముగ్గురికీ మూడు రకాల వంటలు చేయాలి నేను. ఇక మీ మామగారు సర్వీసులో ఉన్నప్పుడయితే నన్ను తయ్య్ మని ఆడించేవారు.
ఐదుగురు చిన్నపిల్లల్ని పోషిస్తూ ఈ ఇంటిని ఇందాక ఈడ్చుకొచ్చానమ్మా. ఒక్కోసారి ఆయన రాత్రి తొమ్మిది గంటల క్కూడా ఏదో చేయమని పురమాయిస్తూ ఉండేవారు. అది చేసే దాకా రాత్రి భోజనానికి లేచేవారు కాదు. విశ్రాంతిగా వాకిట్లో కూర్చుని ఇరుగుపొరుగు వారితో మనసారా మాట్లాడు కోవడానికి కూడా వీలయ్యేది కాదు. ఇంటి చాకిరంతా చేసి తినడానికి కూర్చుంటే తినాలనిపించేది కాదు. ఆకలి చచ్చిపోయేది. అట్లా గడిచిందమ్మా నా బతుకు. కోడలు వస్తే నాకింత విశ్రాంతి దొరుకుతుందని ఎంతో ఆశపడ్డాను. నువ్వింట్లో ఉండి సమయానికి నాకింత వండి పెడితే... ఈ చివరి దశలో హాయిగా ఊపిరి పీల్చు కుందామని ఉందమ్మా!’’ అని దీనంగా అడిగింది.