‘ఆడపిల్లపుట్టక పవిత్రమైనది. ఆమె లేనిదే జాతికి మనుగడలేదు. ఆడపిల్లని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదీ. ఆడపిల్లలంటే ఎందుకంత వివక్ష? ఆడపిల్ల పుట్టేదాకా గ్యారంటీలేదు. పుట్టినతర్వాత భద్రతలేదు. ఏటా కోటిమంది ఆడశిశువులు ఈ లోకాన్ని చూడకుండానే కన్నుమూస్తున్నారట. ‘దీనికి బాధ్యులెవరు? నరనరాల్లో పాతుకుపోయిన సమస్యకు పరిష్కారం ఏ ఒక్కరి పోరాటంవల్లనో సాధ్యపడుతుందా? ఈ కథలో సరోజ ఏం చేసింది?

************************

ఆ గదిలోకి రాగానే ఓ మూలన ముడిచిపెట్టుకుని కూర్చున్న అమ్మాయి కనిపించింది.ఆమెకేసి చూశాను. అడవిపూవులా అమాయకంగా ఉంది. నిండా ఇరవైయేళ్ళుకూడాలేని ఆమె ముగ్గురుబిడ్డలతల్లంటే నమ్మశక్యంగాలేదు. ఆకాశంలో అక్కడక్కడ తేలేమబ్బుల్లా, యవ్వనపుఛాయలు అలా అలా కనిపించి ఆమె మాతృత్వంచాటున మరుగుపడిపోయాయి. ఒత్తిడి తట్టుకోలేక డిప్రెషన్‌లో చేసిన అఘాయిత్యానికి ఈ హోమ్‌కి తీసుకురాబడింది.నా వృత్తిలో భాగంగా స్టేట్‌హోమ్‌కి వచ్చాను. ఇక్కడున్న స్త్రీల మానసికస్థితిని అంచనావేసి వారికి తగిన కౌన్సిలింగ్‌ ఇవ్వడానికి నన్ను నియోగించారు. ఆమెగురించి కొంతతెలిసినా, మరింత తెలుసుకోడానికి ‘‘నీ పేరేంటి?’’ అని అడిగాను. తలదించుకుని మౌనంగా ఉంది. ‘‘నీ పేరేంటి?’’ ఇంకోసారి అడిగాను.‘‘రాకాసి అమ్మ...’’ బిగ్గరగా అరిచినట్టు అంది.‘‘రాకాసి అమ్మా...!!’’ అని ఆశ్చర్యపోతూ, ‘‘అదేంపేరు అమానుషంగా లేదూ?’’‘‘నేను చేసిన అమానుషచర్యకి ఆ పేరే నాకు సరైనది’’ ధైర్యంగా తలెత్తి అంది.

‘‘అమానుషమా!! నువ్వు చేశావా? అదేమిటో నేను తెల్సుకోవచ్చా?’’ వాళ్ళ మనస్సులో గూడుకట్టుకున్నవేదన, ఒత్తిడి బయటకువచ్చేలా చేయడమే నా పని. సాధ్యమైనంత స్నేహంగా మసులుకుంటూ ఆమె మానసికస్థితిని సరిచేయాలి.‘‘నేనే చేశానా? వేరెవరైనా ప్రోత్సహించారా? అన్నదే తెలీదు. నా కథ విని మీరు చెప్పగలరా? కథంటే నా ఒక్కదానిదే కాదు. మన ఆడపిల్లల కథ’’ అంది.నేనూ ఆడదాన్నేగా వెంటనే తలూపాను.

************************

డిసెంబర్‌ నెల. ఉదయం పదిగంటలు దాటినా ఇంకా చలిగానే ఉంది. రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో ఓ మారుమూల గ్రామం. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో బల్లమీద పడుకునుంది సరోజ.‘‘అమ్మా భయంగా ఉందే....’’ నూతిలోంచి వచ్చినట్టుగా ఉంది సరోజ మాట.పక్కనే కూర్చున్న వర్ధనమ్మ కూతురుకేసి చూసింది ఎత్తైన కడుపుతో, రక్తంలేకపాలిపోయి, జీవంలేనట్టుగా ఉంది. పట్టుమని ఇరవైఏళ్ళు లేవు తన కూతురికి. అప్పుడే మూడోసారి కానుపు. నొప్పులు వస్తున్నాయని పొద్దున్ననగా వచ్చారు. పట్టించుకునేనాథుడే లేడు. ఈ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంతప్ప ఇంకో దిక్కులేదు ఈ పల్లెలో. డాక్టర్‌ టౌన్‌నుంచి వస్తుంది. మిగిలిన స్టాఫ్‌ ఒకళ్ళో ఇద్దరో ఇక్కడుంటారు. వాళ్ళకి వైద్యం కొంత, దానిమీద వచ్చే ఆదాయం ఎంత అన్నదే తెలుసు. మంచివైద్యం కావాలంటే యాభై కిలోమీటర్లదూరంలో ఉన్న పట్టణంవెళ్ళాలి. అక్కడ వైద్యంచేయించుకునే స్థోమత ఆమెకులేదు. దీర్ఘంగా నిట్టూర్చింది వర్ధనమ్మ. ఎలా బతికిన జీవితం ఎలా అయిపోయింది. గతం గుర్తుకొచ్చింది.