ఇప్పటి రోజుల్లో ఎవ్వడో యెక్కడో చేసుంటేచేసుండవచ్చు గాక. కాని, అప్పల్రాజు అలాచేస్తాడని నేనెన్నడూ అనుకోలేదు.అనుకోవడం యేవిటి, కలలో కూడాఊహించలేనిదివాడి పోకడ.మా ఊరి మాంచాలమ్మ చెరువు తాటి చెట్టంత యెత్తున పొంగి పొర్లుతుందంటే నమ్మగలను గాని, ధరలన్నీ ఉన్న పళంగా మా తాతల కాలం నాటి స్ధాయికి తగ్గిపోయాయంటే నమ్మగలను గాని, నా మేనల్లుడు అంత ఘాతుకానికి ఒడిగడ్తాడంటే చర్మం ఒలచి చేతిలో పెట్టినా నమ్మలేని పరిస్థితి.
చిరుప్రాయం నుండి వాడి మంచితనం పైన నాకెంతటి విశ్వాసమని! మరిప్పుడు జరుగుతున్న దేమిటి? నేను చూస్తున్న దేమిటి? అప్పుడప్పుడు కాలప్రభావం వల్ల మానవనైజంలో మార్పులు సంభవిస్తాయని నాకు తెలుసు. మరి పరిణామాలు ఇంతలా నిప్పురవ్వలై కురుస్తాయని నేనెన్నడు అనుకోలేదు.మా పెద్దమ్మాయి పరిమళాన్ని రెండు సంవత్సరాల తేడా వల్ల అప్పల్రాజుకి జత కట్టలేక పోయామని ఆనాడు నేనూ మా ఆవిడా ఎంతగా దురపిల్లామని! ఇప్పుడు తరచి చూస్తే అలా జరగడం మంచికే. యెంత అందగత్తయితే మాత్రం, యెంతటి కలవారి కుటుంబానికి చెందినదయుతే మాత్రం కన్న తండ్రిని ఒంటరివాణ్ణి చేసి దాని వెంట బసవన్నలా వెళ్లి పోవడమే!
మగజన్మ యెత్తిన వాడికి కాస్తంత సిగ్గూ, స్ఫురణా ఉండొద్దూ! అవకాశం దొరికింది కదాని కన్న తండ్రిని, స్వయాన మా మేనబావగారిని అలా ఒంటరిగా విడిచి చెన్నైకి ఛల్ మోహనరంగా అని చెక్కేయడమే! కన్న తండ్రి అన్న బంధం మాట అటుంచి చూస్తే, వీడి కోసమూ, వీడి అక్కయ్య కోసమూ ఆయన చేసిన త్యాగాలు యెన్నని? నోటితో లెక్క గట్టగలమా!నాకు ఒళ్ళంతా ఉడుకెత్తి పోతుంటే యిక ఉగ్గబట్టలేక చండీగఢ్‌లో భర్తతో సంసారం సాగిస్తున్న నా మేనకోడలు విశాలాక్షికి ఫోను చేసాను.‘‘చూసావమ్మా నీ బంగారు సోదరుడు చేస్తూన్న ఘనకార్యం! మొన్న మెన్ననే యాభై ఐదు దాటిన మా బావగారిని ఒంటరిగా విడిచి అందమైన కొత్తపెళ్లాన్ని వెంటబెట్టుకుని సింగారం చెన్నైకి యెలా వెళ్లి పోతున్నాడో! వాడలా కూని రాగం పాడుకుంటూ దక్షిణాద్రికి వెళ్ళిపోతుంటే నువ్వు చుస్తూ ఊరుకుంటావా?’’