‘‘మీరు త్వరగా ఇల్లు కట్టేస్తే బావుంటుంది కదా!’’ చరిత ఎప్పటిలానే త్వరపెట్టింది.‘‘బాగానే ఉంటుంది కానీ అంత డబ్బు మన దగ్గర లేదు చరితా!’’ నేను కూడా ఎప్పుడూ చెప్పే మాట చెప్పాను.‘‘ఎప్పుడూ అదే మాటంటావ్ రాకేష్! ఇంటికి స్థలం కొనడమే కష్టమైన విషయం. మనకు నిక్షేపం లాంటి స్థలం ఉంది కదా! అదీ మీ నాన్నగారు మీకు మిగిల్చిన ఆస్తిగా మీ పేరిట రావడం అదృష్టం. ఇంతకంటే అదృష్టం ఎవరికీ ఉండదు!’’ చిరుకోపంతో చెప్పింది చరిత.
‘‘ఔను, నిజమేగానీ, మాకిచ్చే లోన్ ఇల్లు కట్టేందుకు సరిపోదు. ఇంకొంచెం మన సేవింగ్స్ పెరిగితే కానీ ఇల్లు కట్టడం గురించి ఆలోచించలేం’’ నా నిస్సహాయతను తనకు వెల్లడించాను.‘‘ఈ అద్దె ఇళ్ళల్లో ఎన్నాళ్లని ఉంటాం చెప్పు? ఇరుకు గదులు, చాలీచాలని నీళ్ళు, చాలా ఇబ్బందిగా ఉంటోంది. అదే మన సొంత ఇల్లైతే మనక్కావలసిన విధంగా కట్టుకుని హాయిగా ఉండొచ్చుకదా’’‘‘చూద్దాం. దేనికైనా టైం రావాలి కదా!’’‘‘ఇందాక జగన్నాథ్ గారు, గౌరి గారు వచ్చారు. వచ్చే సోమవారం లీవ్ పెట్టాలి మీరు. వాళ్ల గృహప్రవేశమట!’’ టీపాయ్ క్రింద నుంచి కార్డ్ తీస్తూ చెప్పింది చరిత.‘త్వరగా ఇల్లు కడదామన్నా ఆమె ఆలోచనకు ఇదన్నమాట కారణం’ అనుకుంటూ కార్డ్ అందుకున్నాను.
‘‘రాకేష్! మీరు కూడా త్వరగా ఇల్లు కట్టేసుకుంటే బావుంటుంది’’ జగన్నాథ్‌గారు అంటుంటే నేను నవ్వాను. ‘‘రాకేష్ ఎప్పుడూ అలా నవ్వి ఊరుకుంటాడు’’ జగన్నాథ్‌గారి శ్రీమతి గౌరి అన్నారు.నా నవ్వును కొనసాగించడం మినహా నేను చెయ్యగలిగిందేమీ లేదు మరి!నాన్నగారి మరణానంతరం ఆయన మిగుల్చుకున్న పెన్షన్ డబ్బుల్లో అక్క పెళ్ళయ్యాక మిగిలిన ముప్ఫైవేలతో ఏదోఒకటి చేస్తే బాగుంటుందని చెప్పింది అమ్మ. సొంత ఇల్లంటే మమకారం లేనిదెవరికి? అక్క పెళ్ళైపోయాక నాన్నగారి బ్యాంక్ ఎకౌంట్లో మిగిలిన మొత్తం ఆ ముప్ఫైవేలే!