ఆమె ఆ ఇంట్లోకి ప్రవేశించింది. మేడమీద నుండి గుక్కపట్టిన పాపాయి ఏడుపు వినిపిస్తోంది. ఆమెలో ఆందోళన. వడి వడిగా మెట్లెక్కి పైకి వెళ్ళింది. గది తలుపులు మూసి ఉన్నాయి. బలంగా నెట్టి లోపలికెళ్ళింది. అక్కడి దృశ్యం చూశాక ఆమెలో ఆవేశం పెల్లుబికింది. ఏయ్‌! ఏం చేస్తున్నావు? అంటూ అతడి కాలర్‌ పుచ్చుకుని బలంగా లాగి పక్కకు నెట్టింది. మంచంమీద ఉన్న పాపాయిని తీసుకుని భుజాన వేసుకుంది! అక్కడ...ఏం జరుగుతోంది? అతనెవరు?

****************************

‘‘పొద్దున్నే పూజగదిలో గణగణ మోగుతున్న గంటచప్పుడుకు చప్పున మెలకువ వచ్చింది జలజకు. ‘‘అబ్బా! పొద్దున్నే ఈవిడగారి పూజ ఒకటి. సెలవురోజు కూడా కంటినిండా నిద్రపోనివ్వరు కదా..! నాన్సెన్స్‌’’ తలగడలో మొహం దాచుకుని, మళ్ళీ అటువైపు తిరిగి పడుకుంటూ అత్తగారిని విసుక్కుంది జలజ.ఒక్కసారి మెలుకువ వచ్చిందంటే మళ్ళీ ఎంత ప్రయత్నించినా నిద్రపట్టదు. ఇహ లాభం లేదనుకుంటూ లేచింది. జుట్టు ముడివేసుకుంటూ నైటీలో మెట్లు దిగుతున్న జలజకు, హాల్లో వరుసగా నిలబడిన వంటామె, డ్రైవర్‌ సహా పనివాళ్ళందరికీ హారతి చూపిస్తున్న అత్తగారు కనిపించింది. వాళ్ళంతా ఎంతో వినయంగా ముందుకువంగి భక్తితో ఆ హారతిని కళ్ళకు అద్దుకుంటున్నారు. కాసెపోసికట్టిన కంచిపట్టుచీరలో ఉన్న అత్తగారిని వెనుకనుండి ఒక్కక్షణం అలానే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది జలజ. పచ్చిపెసరరంగుకి మెరూన్ కలర్‌ హంసలజరీ బార్డరుచీరలో మెరిసిపోతోంది. తలారా స్నానంచేసి, వదిలేసిన పొడవాటి జుట్టు చివర చిన్నముడి, మొహాన ఎర్రటి కుంకుమబొట్టు, జీవం ఉట్టిపడే కళ్ళకు సన్నని కాటుకరేఖ, ముక్కుకు ఎర్రని ఏడురాళ్ళ ముక్కుపుడక, చెవులకు అంతేసి ఎర్రరాళ్ళ కమ్మలు, ఆమె మేనిఛాయతో పోటీపడుతూ, మెడలో మెరిసిపోతున్న బంగారుచంద్రహారం...అరవై ఐదేళ్ళ వయసులో అత్తగారు ధరిత్రీదేవి, సాక్షాత్తూ ఆ మహాలక్ష్మి అందాన్ని తనే పోతపోసుకుందా అన్నట్టుంది.‘అబ్బ ఎంత అందం ఈవిడది. వయస్సులో ఉన్నప్పుడు ఇంకెంత అందంగా ఉండేవారో...’ తను కూడా అందంగానే ఉంటుంది.

అయినా అత్తగారి అందం ఒక్కక్షణం ఆమెను అసూయపడేలా చేసింది. బ్రష్‌ చేసుకుని వచ్చి డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చున్న కోడలికి కాఫీ ఇస్తూ ‘‘నువ్వూ తలస్నానం చేసిరా జలజా. ఈరోజు ముక్కోటి ఏకాదశి. ఆదివారం కూడా కలిసొచ్చింది’’ నవ్వుతూ అంటున్న అత్తగారిని చూస్తే చిరాకేసింది జలజకు. అక్కడే దేవుడిగది ముందు గద్దెపీటమీద కూర్చుని జపం చేసుకుంటున్న ఎనభైఏళ్ళ అత్తగారి అత్తగారు ఒక్కక్షణం వెనక్కి తిరిగి జలజవైపు అభావంగా చూసి మళ్లీ జపంలో నిమగ్నమయ్యారు. ఏదో అనబోయి మామ్మగారినిచూసి నిశ్శబ్దంగా ఉండిపోయింది జలజ. ‘‘నువ్వెలాగూ అందరిగురించీ పూజలు చేస్తావుకదా ధరిత్రీ, ఇక సెలవురోజు కోడల్ని కూడా పూజలంటూ హడావిడిచేసి ఇబ్బందిపెట్టడం ఎందుకోయ్‌!’’ అన్నారు అప్పుడే అక్కడికొచ్చిన మామగారు. తన మనసులోనిమాట ఆయనే అనడంతో జలజకు లోలోపల సంతోషం వేసింది. అవునన్నట్లు తలూపింది మామయ్యగారివైపు చూస్తూ,