‘‘ఛయ్...నీ...’’ ఒక్క తోపు తోసాడు విసురుగా.తమాయించుకోలేక వెనకనున్న మట్టిగుట్టమీదకెళ్ళి పడ్డా. గుండెలవిసి పోయాయి! అసలూహించలేదది.‘‘ఏదో బతిమిలాడేవని నా పనులు మాను కుని తీసికెళ్ళి కట్టు కట్టిస్తే.... ఏం మాట్లాడు తున్నావ్...రేపు గానీ నా డబ్బులు తెచ్చివ్వకపో....’’ చూపుడు వేలుతో బెదిరిస్తూ నా మీదకు రాబో తున్న అర్జున్‌ని ఇంట్లోంచి పరుగెట్టుకొచ్చిన అతడి భార్య వెనక్కి లాక్కెళ్ళింది చెయ్యి పట్టుకుని.గుండె దడ తగ్గలేదు. మెల్లగా లేవబోయా. సాధ్యం కాలేదు. నీరసం కమ్మేసింది. అరవై రెండేళ్ళ జీవితంలో నా మీద ఎవడూ ఇలా చెయ్యి వేసింది లేదు. అసలు నేనెవర్నో తెలుసా వీడికి? గ్రేడు వన్ ఆఫీసరుగా రిటైరయ్యాననీ, సర్వీసులో వుండగా నా కింద నలభైమంది సిబ్బందీ, కారూ నౌకర్లూ వుండేవారనీ తెలిస్తే ఇలా ప్రవర్తించే వాడా?ఇంత బతుకూ బతికి చివరికి ఇలా ఓ అనా మకుడి చేతిలో.....ఉక్రోషం వచ్చింది. ఎవరూ చూడలేదు కదా...అంతలో వచ్చింది కుక్కపిల్ల! అదే! ఆ కుక్కపిల్లే! నా కోపం కట్టలు తెంచుకుంది.‘‘ఛీ..దరిద్రప్పీనుగా...నీ మూలంగానే కదే నాకీ ఖర్మ పట్టిందీ’’ అంటూ కాలితో బలంగా ఓ తాపు తన్నేను దాన్ని.
గాల్లోకి ఎగిరి నాలుగు గజాల దూరంలో పడి కుంటుకుంటూ ఏడుస్తూ పారిపోయిందది. నా కసి తీరి కాస్త ఉపశమనం కలిగినట్టయింది. బలం వచ్చింది. మెల్లగా లేచి బట్టలు దులుపుకుని ఇంటిముఖం పట్టేను.ఎందుకు నాకీ దుస్థితి దాపురించింది! రోజూ పొద్దున్నే వాకింగ్‌కి వెళ్ళి వచ్చేవాడిని నా మానాన నేను రాకుండా ఆ కుక్క పిల్లల సంగతెందుకు పట్టించుకోవాలి? అవును... అసలు కుక్కలన్నా, కుక్కల్ని పెంచేవాళ్ళన్నా నాకిష్టం వుండేది కాదు కదా! మరెందుకు వాటిమీద ప్రేమ కలిగింది?వాకింగ్‌కు వెళ్ళి వెనక్కి తిరిగే చోట తూముగట్టు మీద కాసేపు కూర్చుని, దగ్గర్లో వున్న ఎర్రపూల చెట్టుకింద నిలబడి చేతులు చాచడం, మెడ తిప్పడం, వంగి మోకాళ్ళని ముద్దుపెట్టుకునే ప్రయత్నం-ఈ వ్యాయామం అంతా రోజూ నేను చేస్తున్నదే. అయితే ఆ రోజు రెండు మూడు కుక్కపిల్లలు చెట్టు మొదట్లో నిలబడి నా విన్యాసాన్ని విచిత్రంగా చూడటం గమనించా. చేతులు బార్లా చాచినపుడు భయపడి చెట్టు వెనక్కి పారిపోయాయి. ‘వీటికింకా ప్రపంచం తెలియదు... రోజుల పాపలై వుంటాయి’ అను కున్నాను. తల్లెక్కడా దరిదాపుల్లో కని పించలేదు.