‘‘ఒరే అభీ.. నీ పుట్టిన రోజుకేం బహుమతి కావాల్రా?’’ నా మాటకి ఏడేళ్ళ అభి చటుక్కున ‘‘తెల్లగా బొద్దుగా ఉండే బుజ్జి కుక్కపిల్ల కావాలమ్మా’’ అన్నాడు.ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది. ‘‘ఛా.. అదేం కోరికరా. కుక్కలంటే నాకు చచ్చేంత ఎలర్జీ’’ పెలపరించుకున్నాను. వాడి ముఖం పాలిపోయింది. బుంగమూతి పెట్టాడు.‘‘కుక్కలు చాలా ప్రమాదకరం రా. అవి కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు చేయించుకోవాలి తెలుసా.’’‘‘ఆ కుక్కలు వేరు. పప్పీలెంతో మంచివమ్మా.’’‘‘నోర్ముయ్‌. ఇంకోసారి వాటి వూసెత్తితే ఊరుకోను’’ మందలించాను.‘‘నువ్వడిగావు. వాడు చెప్పాడు. ఇస్తే ఇస్తానని చెప్పు. లేదా ఇవ్వనని చెప్పు వల్లీ’’ తేజా అన్నాడు.‘‘కుక్కలంటే నాకు భయం. అసహ్యం..’’బిక్క మొహం పెట్టి, ‘‘నాకు పప్పీ కావాలి నాన్నా’’ అన్నాడు అభి తేజాతో.‘‘అన్నిటికీ మీరలా వెనకేసుకు రాబట్టే వాడిలా పెంకిగా తయారయ్యాడు. పాలు తాగడు. పెరుగన్నం తినడు. బుద్ధిగా ఒక చోట కూర్చుని హోంవర్కు చేసుకోడు. పదిసార్లు లేపితేగాని లేవడు. స్కూలుకి టైమైపోతున్నా తెమలడు. కాస్త సమయం దొరికితే చాలు సెల్‌ పట్టుక్కూర్చుంటాడు...’’‘‘వాన వెలిసిందా’’ తేజా.‘‘ఇదొకటి చాతనవును’’ కళ్ళతోనే నవ్వి ‘‘చూడు అభీ. 

పుట్టినరోజుకి ఏవైనా తినేవీ, ఆడుకునేవీ, కట్టుకునేవీ, చదువుకునేవీ, దాచుకునేవీ అడగాలి.. తెల్సిందా’’ అభి పక్కన కూర్చుని అనునయంగా చెప్పాను.‘‘పప్పీతో ఆడుకుంటానమ్మా’’ మెరుస్తోన్న కళ్ళతో ఉత్సాహంగా అన్నాడు.నివ్వెరబోయాను. బిగ్గరగా నవ్వాడు తేజా. రుసరుసలాడుతూ వంటింట్లో కెళ్ళిపోయాను.మర్నాడు స్కూలు నుంచి రాగానే పుట్టిన రోజుకి కావాల్సిన సరంజామా కొనుక్కు రావడానికి బజారుకెళ్ళారు తేజా, అభి. ఓ గంట తర్వాత, ‘‘వాట్సాప్‌లో ఓ ఫొటో పంపాను. ఎలా వుందో చూసి చెప్పు వల్లీ’’ ఫోన్‌ చేసి చెప్పాడు తేజా.తెల్లని బుజ్జి కుక్కపిల్లని ఎత్తుకుని విజయగర్వంతో నవ్వుతున్నాడు అభి. ఒళ్ళు మండి, ‘‘పరమ అసహ్యం. ఉత్త చెత్త. వద్దే వద్దు’’ జవాబు పంపాను.అయినా వాళ్ళు కొనేస్తారేమోనని భయ మేసింది. పిచ్చి పనులు చేయొద్దంటూ ఫోన్‌ చేసి హెచ్చరించాను. అయినా నా ఆందోళన శాంతించలేదు. వాళ్ళ వెంట నేనూ వెళ్ళుండాల్సిందనుకుంటూ చింతిస్తోంటే, అలంకరణ సామాగ్రితో వచ్చారు.