‘‘ఏరా! బర్త్‌డేకి కూడా పార్టీ ఇవ్వటం మానేశావు!? అదివరకే నయం, డాక్టర్ కాకముందే పార్టీలుండేవి. డాక్టరై సంపాదిస్తూ ఇంకా కంజూస్ ఐపోయావ్’’ నిష్ఠూరంగా అన్నాడు సుధీర్, క్యాంటిన్ దగ్గర ఎదురుపడగానే.వాడితో ఆర్గ్యూ చెయ్యబుద్ధికాలేదు. ముందుకెళ్తుంటే చెయ్యిపట్టుకుని ఆపాడు.‘‘సర్లే, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం’’ అన్నాడు. ఈసారి గొంతులో నిష్ఠూరం లేదు స్నేహంగా, మృదువుగా ఉంది.
‘‘ఏమైందిరా! శశాంక్, ఏ పేషంట్‌కైనా సీరియస్‌గా ఉందా?’’ అడిగాడు.‘‘సెంటిమెంట్ అనికాదుగానీ, కొంతకాలం హాస్పిటల్‌లోవుండి, అభిమానంగా మాట్లాడేవాళ్ళతో వద్దన్నా కొంత అటాచ్‌మెంట్ ఏర్పడుతుంది. దాన్ని నువ్వు అవాయిడ్ చెయ్యలేవు’’ అన్నాను.‘‘నిజమేలే, క్యాంటిన్‌లో కాఫీతాగి ఇంటికెడదాం, కాసేపు కలిసి టైం స్పెండ్ చేద్దాం’’ అన్నాడు సుధీర్.‘చాలారోజులైంది, నిజమే!’‘‘శశాంక్, నేను విన్నది నిజమేనా?’’ సీరియస్‌గా అడిగాడు సుధీర్.బాటిల్‌లో మంచినీళ్ళు తాగుతున్ననాకు కొరపోయింది.
సర్దుకున్నాక, ‘‘ఏరా, నువ్వు ఏంవిన్నావో నాకెలా తెలుస్తుంది? నువ్వు ఏం విన్నావో విషయం చెప్పు, అది నిజమో! కాదో నేను చెప్తాను’’‘‘డాక్టర్ కుముద...నీకు ప్రపోజ్ చేసిందట! నువ్వు రిజెక్ట్ చేశావట?’’ క్షణం ఆగి, ‘‘కుముదను మించిన కుందనపుబొమ్మ నీకు దొరుకుతుందా! నువ్వేమైనా మన్మధుడివా? షారూక్, సల్మానుల్లాగా ఉంటావా? సామాన్యంగా ఉండే మనబోటివాళ్ళని అంత అందమైన, చదువుకున్ రిచ్‌గర్ల్ అడిగితే ఎందుకు రిజెక్ట్ చేశావు’’ సూటిగా అడిగాడు సుధీర్.నిజమే! వాడు అన్నదాంట్లోనూ నిజం ఉంది. కానీ అది పూర్తిగా నా స్వవిషయం.
కానీ వాడు నా కజిన్. నా కోసం ప్రాణంపెట్టే స్నేహం వాడిది. అలాంటివాడికి ‘నా ఇష్టం–నా స్వవిషయం నువ్వు జోక్యం చేసుకోకు’ ని కర్ట్‌గా చెప్పలేనుగా. వాడు అక్కడితో ఆపకుండా కొనసాగింపుగా, ‘‘ఏరా! పెద్దమ్మ చెప్పింది, నువ్వు చాలామందిని రిజెక్ట్ చేశావట. ప్రతీసారి గొడవేనటగా? అమ్మతో చెప్పింది పెద్దమ్మ. మా అమ్మ నన్నడిగింది. ఏమిటిసంగతి?’’ వాడిగొంతులో క్యూరియాసిటి. తెలిసిన విషయమే అయినా నా నోటితో వినాలని వాడి కుతూహం!