‘‘అమ్మగారో..!’’ ఆ పొలికేక అబ్బడిది.రోజూలాగే గేదె పాలు పిండడాని కొచ్చేడు కాబోలని పాల తపేలా పట్టుకుని బైటికెళ్లేను.మా గేదె పేరు అరుంధతి. దాని దూడ జేజమ్మ. అవి రెండూ ఇంటి కొచ్చిన రోజే టీవీలో ‘అరుంధతి’ సినిమా వచ్చింది. వెంటనే మా పిల్లలు వాటికాపేర్లు పెట్టేశారు. ఇంటి కెదురుగా గేదెల్ని కట్టే ఖాళీ స్థలం ఒకటుంది మాకు. ఒకప్పుడు బహువచనమేనట కాని, ఇప్పుడు ఏకవచనం మాత్రమే. అంటే ఒకటే గేదె ఉందన్నమాట! వట్టిపోయినప్పుడల్లా దాన్ని సంతలో అమ్మేసి పాలిచ్చే కొత్త గేదెను కొని తెచ్చుకుంటాం.అబ్బడి వెనకాల నలుగురు కుర్రాళ్లు నుంచుని ఉన్నారు. వెలిసిపోయిన పాత జీన్స్‌, రంగురంగుల టీషర్టులు, కళ్లను కప్పేసేలా నుదుటి మీదికి జుట్టు, ట్రిమ్‌ చెయ్యకుండా పెంచిన గడ్డాలూ మీసాలూ. ముగ్గురూ ఎటో చూస్తూ నిల్చున్నారు. 

ఒకడు మాత్రం తెచ్చి పెట్టుకున్న నిర్లక్ష్యంతో నా వైపు చూశాడు. నేను తపేలా అబ్బడి చేతికిచ్చి ‘ఎవరు వీళ్లు?’ అన్నట్టు చూశాను. అబ్బడు తపేలా చంకలో ఇరికించుకుని చేతులు నలుపుకొంటూ ‘‘అమ్మగారూ! ఈల్లిక్కడ మన కాలీస్తలంలో టెంటేసుకుంటారంటండి, నన్నడిగేరండి. అమ్మ గారు సేనామంచోరు. నేనడుగుతాను, మీకా బయవేవీలేదని ఎంటెట్టుకొచ్చేనండి’’ అన్నాడు.ఈ అబ్బడెప్పుడూ ఇంతే, ముందరి కాళ్లకి బంధం వేస్తాడు. రాబోయిన కోపాన్ని ఆపుకొంటూ ‘‘ఇట్రా’’ అని అబ్బడిని మా వంటింటి పెరటివైపు పిల్చుకెళ్లేను. ‘‘నీకే వైనా బుద్ధుందా? ఆ కుర్రోళ్లూ వాళ్ల రౌడీ వేషాలూను, వాళ్లని మన స్థలంలో టెంటు వేసుకోమన్నావా! దేనికి? రేప్పొద్దున్నవాళ్లు టెంటు తియ్యం అని ఎదురు తిరిగితే ఏం చేస్తాం? అసలు బుర్రుందా నీకు?’’ అన్నాను.

‘‘అయ్యో అమ్మగారూ, మీరు బలేవోరండి. నేనేవంత తెలివి తక్కువోణ్ణేటండి? ఆల్లెవరనుకుంటున్నారు, అవతలీది కుర్రోల్లండి. ఎలచ్చను మూడు వారాల్లో కొచ్చేసింది కదండి. అప్పుడు దాకా ఆల్ల ‘గోరు’ పార్టీ తరపుని ఇక్కడ టెంటేసుకుని నాలుగు కుర్చీలేసుకుని నలుగురూ కూకుంటారండి. మన కేవీ సెబ్బరుండదండి’’‘‘గోరు పార్టీ వాళ్లా?’’ అన్నాను అనాలోచితంగా.‘‘మరేండి’’ అన్నాడు అబ్బడు ఉత్సాహంగా. నేను అప్పుడప్పుడు గోరు పార్టీకి అనుకూలంగా మాట్లాడ్డం విన్నట్టున్నాడు, నిజానికి నాకు రాజకీయాల మీద సదభిప్రాయం లేదు.