సడన్‌గా మా ఆవిడ ఇళ్ళు ఖాళీ చేయించింది. నేను ‘‘ఎందుకు... ఏమిటని’’ అని అడగలేదు. అడిగినా తను చెప్పదని నాకు తెలుసు. రాత్రికి రాత్రే ప్యాకర్స్... మూవర్స్‌ని పిలిపించి ‘షిఫ్ట్’ చేయించింది. నెల తర్వాత పాత ఇంటి ఓనర్.. ఫోన్‌చేసి ‘‘రామ్మూర్తిగారూ మీకేదో పార్శిల్ వచ్చింది..’’ అని చెప్పాడు. ఆఫీసు నుండి రిటన్ వస్తూ పార్శిల్ తీసుకోవడానికి స్కూటర్‌లో వెళ్ళాను. ‘లాల్‌బీ’ కన్పించింది. తనలో అదే చలాకీతనం...
***************************
మా ఆవిడ కంటికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. చిన్నప్పటినుండి కంట్లో ఏదో దోషం ఉందట. అది పెరిగి పెద్దదై ఆపరేషన్ దాకా విషయం వచ్చింది. దాంతో ‘లేజర్’ ఆపరేషన్ అనివార్యమైంది.‘‘నా కళ్ళు అందమైనవి.. నేను జీవితకాలంలో ఎప్పుడూ ‘అద్దాలు’ పెట్టను. పెట్టి నా కళ్ళకు ఉండే అందాన్ని పోగొట్టుకోనని..’’ అతిశయాన్ని కలగలపి అంటుండేది.కానీ ఇప్పుడు ఏకంగా గుడ్డివాళ్ళకు మల్లే ఆపరేషన్ తర్వాత ‘నల్లఅద్దాలు’ పెట్టాల్సి వచ్చింది.అసలు ఆ కళ్ళకు ఆపరేషన్ చేసే స్థితికి రావడం కూడా ఒక విచిత్రంగానే జరిగింది.‘ఫేస్‌బుక్’లో పోస్ట్సు ఈ ‘మెయిల్స్’ ‘చెక్’ చేసుకోవడానికి మా అబ్బాయి ‘ల్యాప్‌ట్యాప్’ వాడేది.‘స్ర్కీన్’ ఏంటి తెల్లగా కన్పిస్తుంది అని గొడవ చేసేది.ఆరోజు హాస్టల్‌లో ఉంటూ ‘బోర్డ్’ సరిగ్గా కన్పించడం లేదంటూ వచ్చిన నా కూతురు చిన్మయితో కలిసి వాళ్ళమ్మను కూడా పంపాను.
డాక్టర్లు ఇద్దరికీ ‘చెక్’ చేసి ఒకరికి కళ్ళద్దాలు రాసి మరొకరికి ‘ఆపరేషన్’ ‘డిక్లేర్’ చేసారు. కళ్ళద్దాలు తీసుకొని మా అమ్మాయి క్యాంపస్‌కి వెళ్ళిపోతే వెంటనే ఆపరేషన్ చేయాలనడంతో మా ఆవిడ ఆపరేషన్ ‘థియేటర్’లోకి వెళ్ళింది. అసలు సమస్య నాకు ఇక్కడే మొదలైంది. కనీసం వారం రోజులు మా ఆవిడకు ‘రెస్ట్’ ఇవ్వాలట. వారం రోజులంటే చిన్న విషయం కాదు. ఆఫీసులో అసలే ఇన్స్‌పెక్షన్ జరుగుతుంది. ఇంట్లో పనులన్నీ ఎవరు చేయాలి...? పిలుద్దామంటే దగ్గర్లో బంధువులు కూడా ఎవరూ లేరు. అన్నింటికన్నా ‘పులిమీద పుట్ర’లా మా పనిమనిషి లక్ష్మి వాళ్ళు రాష్ట్రంలో ఏదో ‘జాతర’ ఉందని వెళ్ళింది. ఆ పిల్లది కర్ణాటక రాష్ట్రం. బ్రతుకు తెరువుకోసం వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ‘మీ అమ్మకు ఆపరేషన్ చేయాలి.. మాకు కష్టం అవుతుంది ‘ఉండు లక్ష్మీ అన్నా..’’ తను ‘ససేమిరా’ అని బయలుదేరింది. పైగా తానొచ్చాక ఆపరేషన్ పెట్టుకోమంది. దాంతో నాకు కష్టాలు మొదలయ్యాయి. మేముండేది సెకండ్ ఫ్లోర్‌లో క్రింది నుండి తాగడానికి ‘మంజీర’ వాటర్ పట్టుకొని పైకి వెళ్ళాలి.కేవలం ఈ నీళ్ళు తేవడానికే లక్ష్మికి నాలుగు వందలు ఇస్తున్నాం.