ఫోన్ రింగైంది.‘‘హలో ..’’‘‘ఉమా ..’’‘‘అవును, చెప్పండి’’‘‘ఉమా, గుర్తుపట్టలేదా? నేను శేషూని.’’‘‘చెప్పండి..’’‘‘ఏంటి చెప్పండి చెప్పండి అంటావ్, ఈ అండీ ఎక్కణ్నుంచొచ్చింది మధ్యలో. చిన్నప్పటిలాగా శేషూ అనొచ్చుగా..’’‘‘ ...... ’’‘‘మాట్లాడు ఉమా.. ’’‘‘ఏం మాట్లాడను!’’‘‘నా ఉత్తరం అందిందా? ఫోన్లో అన్నీ సరిగా చెప్పలేనని ఉత్తరం రాశాను.’’‘‘ఊ ...’’‘‘ఈ పొడిపొడి ఊఁ .. ఆఁ .. లేంటి, నీ ఉద్దేశం చెప్పొచ్చుగా..’’‘‘నువ్వు చాలా ఆలోచించుకుని టైం తీసుకుని ఆ ఉత్తరం రాశావు. నేనూ ఆలోచించుకోవాలిగా..’’‘‘ఏం ఆలోచిస్తావ్, నీ బదులు కూడా నేనే ఆలోచించి ఆ ఉత్తరం రాశానని నీకర్థం కావడం లేదా? నీకు గుర్తుందా, చదువుకునే రోజుల్లో నేను నీవెంట ఎలా తిరిగేవాడినో..’’‘‘హహ్హహ్హా ..’’‘‘ఎందుకంత నవ్వొస్తా ఉంది?’’‘‘ఏమీ లేదు, డెబ్భయ్యో పడిలో చదువుకునే రోజుల ప్రస్తావన తెస్తేనూ... నవ్వు ఆగడం లేదు.’’‘‘నువ్వు నా కన్నా నాలుగేళ్ళు చిన్నదానివి, నా ఫ్రెండు చెల్లెలివి. మా నాన్న అడిగినంత కట్నం మీ నాన్న ఇవ్వకపోబట్టికాని, నువ్వే నా పెళ్లానివై ఉండేదానివి తెలుసా! అప్పట్లో ఇలా మాట్లాడేదానివి కాదు. మా క్లాస్‌మేట్ గోపాలంగాడన్నట్టు ముగ్ధమనోహరంగా ఉండేదానివి.’’‘‘ఈ వయసులో ముగ్దత్వమూ, మనోహరమూ ఎక్కణ్నుంచొస్తాయి?’’‘‘ఎందుకురావు, నేను బాగా లేనా ఫొటోలో? నువ్వు కూడా బావున్నావులే, ఆ మధ్య ఒక పెళ్లిలో చూసేను.’’
‘‘నువ్వు బావుంటావులే, మొన్న మెన్నటి వరకూ నీ భార్య నీకు వండిపెట్టి చాకిరీ చేసింది కాబట్టి. అయినా ఇప్పటి ఫొటోస్‌ని నమ్మకూడదులే.’’‘‘ఆవిడ చాకిరీ ఊరికే చేసిందా? ఎన్ని నగలు, ఎన్ని పట్టుచీరలు కొని ఇచ్చేను తనకి! పిల్లలకోసం నేను కూడబెట్టిన ఆస్తులు చూసి గొప్ప సంతృప్తితో పోయింది. వాళ్లు ఇవాళ అంత హైలెవెల్లో బతుకుతున్నారంటే కారణం నేనే కదా! ఇద్దర్నీ మంచి ఉద్యోగాల్లో సెటిలయ్యేలా చేశాను. అఫ్‌కోర్స్ నా ఉద్యోగం అలాంటిదనుకో..’’‘‘అంత సెటిలైన పిల్లలు ఈ వయసులో నిన్ను చూసుకోవడం లేదా?’’‘‘వాళ్లేంటి నన్ను చూసేది! లంకంత ఇల్లు, బోలెడంత పెన్షను, మనలో మనమాట, చాలా ఫ్లాట్లు కొన్నాను. వాటి మీద అద్దెలెంతొస్తాయో నువ్వు ఊహించలేవు. చవకలో కొన్ని ప్లాట్లు కొనిపడేసాను. వాటి రేటు ఇప్పుడు కోట్లలో ఉంటుంది. నా కొడుకులు ఈ పాత కొంపలో ఉండలేమంటూ కొత్త ఇళ్లలోకి దూరంగా పోయారు. పోతే పొండి అని వంట మనిషి చేత వండించుకు తింటూ కాలక్షేపం చేస్తున్నాను. ఆ వంటలు తినలేక చస్తున్నాననుకో..’’