అంత బాధలోనూ నాయిన అన్న మాటలు ఇప్పటికీ నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూనే ఉంటాయి.ఆ రాత్రి అనుభవించిన విషాదంకన్నీరులా ఊరుతుంది. గుండె గొంతుకలో కొట్లాడుతుంది. సలుపుతున్న గాయంలా లుంగలు చుట్టుకుపోతూ కూడా నాయిన ఆ మాటనడం ... ఇప్పటికీ నాలో సుడులు తిరుగుతూనే ఉంది.

ఆ రాత్రి చంద్రుడు నా గది కిటికీలోంచి నన్నే చూస్తున్నాడు. మంచు ధూళిలో కప్పబడ్డ చెట్టులా వుంది మా ఇంటి వసారా. గడ్డ కట్టిన మంచు పలకలా ఆకాశం. అక్కడక్కడా చిట్లిన చీము పొక్కుల్లా చుక్కలు.మంచం పక్కనే కూర్చున్న అమ్మ ...దిగులు మేఘాల్లా కురవడానికి సిద్ధంగా వున్నాయి ఆమె కళ్లు. నాయిన మోకాలు నుంచి బొటన వేలు వరకు కిందకు రుద్దుతూ, ఉపశమనాన్ని కలిగించే ప్రయత్నం చేస్తోంది అమ్మ.‘‘అమ్మో.. అయ్యో.. ఓరిదేవుడో.. ఎంత బాధైతుంది .. పోటు తొడ దాన్క ఎగబాకినట్టుంది. నా వల్లయితలేదు. కాంపౌండర్‌ వెంకటేశ్వర్లును పిల్చక రాపోవే. అయినా వద్దులే .. ఇంకొంచెం సేపు సూసి తగ్గక పోతే పోదువుగనీ ..’’ పైకంటుండేగానీ అంత రాత్రిపూట అమ్మొక్కతే ఎట్ల బోతదనే బాధ నాయిన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది.‘‘నువ్వు లోపలికివో బిడ్డా..’’ కాలిని రెండు చేతులతో బలంగా పట్టుకుని పోటును పంటి కింద అదిమి పట్టి నావైపు తలెత్తి చూశాడు.

తన బాధను చూస్తూ నేను బాధపడతాననేది ఆయన ఉద్దేశం.కానీ, నాయిననలా చూస్తూ నాకు మాత్రం నిద్రెలా పడుతుంది. కనీసం నాయిన దగ్గరుంటేనన్నా ఆయన బాధకు ఒంటరితనం తోడవకుండా ఉంటుంది. ఒళ్లంతా చెమటలు పట్టాయి నాయినకు.నాయినను కుట్టిన తేలు కూడా వెన్నెలలో ముంచి తీసినట్టు తెల్లగా వుంది. వీపు మధ్యలో అడ్డంగా మందమైన గీతలతో నీలం రంగులో ఉబ్బెత్తుగా ... అదొక విషపు బుడ్డిలా కనిపిస్తోంది. తెల్లగా ఉన్నవన్నీ అందంగా అనిపించి ఆకర్షిస్తాయనేది అబద్ధమని నాకు మొదటిసారి తెలిసింది. తెల్లగా వున్న తేలు మరీ ప్రమాదకరమట. కుడితే చాలు పై ప్రాణాలు పైనే పోతాయట. కర్రపుల్లతో చచ్చి పడివున్న తేలును అటూ ఇటూ కదుపుతూ ఉంది అమ్మ.