సూర్యుడు అందరి మీద మండి పడుతున్నాడు.‘ఎప్పుడు బయట తిరగడమేనా కాసేపు ఇంట్లో కూర్చోండిరా’ అంటే వినని పిల్లల్నే కాదు పెద్దలను కూడా బలవంతంగా ఇంట్లోనే ఉండేలా ప్రణాళిక రచించాడేమో వీథులన్నీ బోసిపోయి బావురుమంటున్నాయి. పిల్లల అల్లరిని కంటి కొసల నుండి గమనిస్తూనే, భర్త ఆనంద్ ఇంకా ఆఫీసునుంచి రాలేదేమిటా అని ఆలోచిస్తోంది వనజ. పదిహేనురోజులు సెలవు దొరుకుతుందో లేదో అని అనుమానంగానే ఆఫీసుకెళ్లాడు ఆనంద్. వనజ లేచివెళ్లి తలుపు తీసేలోపు కాలింగ్ బెల్ రెండుసార్లు మోగింది.
‘‘ఆ...ఆ...వస్తున్నా, వంటింట్లో ఉన్నా, పిల్లలకు బూస్ట్ కలుపుతున్నా’’ అంటూ తలుపు తీసింది.‘‘ఈ ఎండల్లో పిల్లలకి మజ్జిగ అలవాటుచెయ్యి అని చెప్తే వినిపించుకోవు’’ లోపలికి వస్తూనే విసుక్కున్నాడు ఆనంద్.‘‘నేను కాదు వినిపించుకోనిది మీ సుపుత్రులే! నేను చెప్తే మీరు విన్నారా? పాలల్లో బిస్కట్లు ముంచి తినడం నేర్పించారు. ఇక వదుల్తారావాళ్లు. అది వాళ్ళకి దినచర్యలో భాగమైపోయింది మరి.’’ అని నవ్వింది వనజ. అవి ఇవి చేసి పెట్టమని ఎండలో సతాయించకుండా బిస్కట్లతో సరిపెట్టుకుంటున్న కొడుకులిద్దరి తలలపై ఆప్యాయంగా ముద్దులు అద్దింది.భర్తకు మజ్జిగ అందిస్తూ, ‘‘ఏమన్నారు?’’ అని అడిగింది.
‘‘ఎవరు?’’ అని యథాలాపంగా అన్నాక గుర్తుకొచ్చి, ‘‘ఏమంటారు వచ్చే నెల ఆడిట్ ఇన్‌స్పెక్షన్ ఉంది. యర్న్ లీవులివ్వడం కుదరదు నాయనా. సి.యల్. ఉంటే వాడుకో’’ అని సలహా ఇచ్చాడు మా మేనేజరు. ‘‘సి.యల్ ఐదురోజులే ఉంది కదా. ప్రయాణబడలికేగానీ, అటు అత్తయ్య, మామయ్యలకు తృప్తి ఉండదు, పిల్లలకు సంతోషం ఉండదు. మీ చిన్నాన్న కూడా గత ఏడాది అననే అన్నాడు తన దగ్గర కనీసం నాలుగురోజులైనా ఉండటం లేదని’’ అసంతృప్తి ధ్వనిస్తోంది వనజ గొంతులో.