‘‘భయం మనసును బలహీనపరుస్తుంది. ఆపద ఎదురైనప్పుడు ఆత్మరక్షణ మార్గం వెతుక్కోవాలి. శత్రువును దెబ్బతీసేయోచన చేయాలి. నీకు వెన్నుదన్ను నేనున్నాను. ఆత్మవిశ్వాసమే మనిషికి శ్రీరామరక్ష’’ హితవచనం చెప్పింది రేణుక.భయంతో కౌగిలించుకుని కన్నీరు కారుస్తున్న కూతురు సునీత వెన్ను నిమిరింది ఆమె.
‘‘మా కాలేజీలో విమలమీద ఏసిడ్ పోసింది ఈ నరేష్ అని అందరూ అనుకుంటున్నారు. ఈ రాక్షసుడు ఇప్పుడు నావెంట పడ్డాడు. తన మాట వినకపోతే నా మీదా ఏసిడ్ పోస్తానంటున్నాడు. భయంగా ఉందమ్మా’’ బేలగా పలుకుతున్న కూతురును ఓదార్చింది రేణుక.‘‘నువ్వు రేపటినుంచి క్లాసులోతప్ప బయటకు వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకో. హెల్మెట్ లేకుండా కాలేజీ క్యాంపస్‌లో తిరగకు. స్కూటీ మీద తిన్నగా కాలేజీకి వెళ్ళి తిరిగిరా. దారిలో ఎక్కడా ఆగకు’’ కూతురు కన్నీళ్ళు తుడుస్తూ సలహా ఇచ్చింది తల్లి. ఆ రాత్రి పక్కమీద పడుకున్న రేణుకకు నిద్ర రావడం లేదు.కూతురికి ధైర్యం చెప్పినా, తల్లి మనసు కీడు శంకిస్తోంది.
భర్తకు విషయం వివరించి చెప్పింది.‘‘పిన్సిపాల్‌కు కంప్లయింట్ చేస్తేనో....’’ భర్త సలహా.‘‘వాడిప్పుడు కాలేజ్ స్టూడెంట్ కాదు. మన అమ్మాయిని బెదిరిస్తున్నట్లు ఆధారాలు లేవు. పైగా ధనవంతుడు, రాజకీయ పలుకుబడి ఉన్నవాడు. మనం బాగా ఆలోచించి అడుగువేయాలి. అమ్మాయి భవిష్యత్తు మనకు ముఖ్యం’’ గృహ మంత్రి అభిప్రాయంతో ఏకీభవించాడు భర్త సర్వేశ్వరరావు. సర్వేశ్వరరావు ప్రభుత్వరంగసంస్థ ఉద్యోగి. డిగ్రీ చదివిన రేణుక ప్రస్తుతం హోమ్ మేకర్. ఆ దంపతుల సంతానం అమ్మాయి సునీత, అబ్బాయి రఘు.ఓ ప్రయివేటు స్కూల్లో టీచరుగా ఉద్యోగం చేసింది రేణుక. భర్తకు ప్రమోషన్ వచ్చి, కుటుంబం ఆర్థికంగా నిలద్రొక్కుకున్నాక ఉద్యోగం మానేసింది. అప్పటికి సునీత టెన్త్ పూర్తిచేసింది.