వాళ్ళు ముగ్గురూ బాల్య స్నేహితులు. ఒకరు వ్యాపారంలో సెటిలైతే, మరొకరు టీచర్‌గా స్థిరపడ్డారు. ఇంకొకరు మాత్రం జులాయిగా మారాడు. మొదటినుంచీ చదువంటే ఆసక్తి లేదతనికి. కానీ దేనికోసమో అన్వేషణ చేసేవాడు. అలా అన్వేషిస్తూనే మౌనయోగిలా ఓ చోట కూర్చుండిపోయాడు. కాల క్రమేణ అతడు మౌనబాబాగా ప్రసిద్ధి చెందాడు. ఇక షరా మామూలే, చుట్టూ చేరాల్సిన హంగులన్నీ చేరాయి. కానీ...
నిత్యానంద్ చనిపోయాడని వార్త తెలిసే సమయానికి నేను హైద్రాబాద్‌లోని ఓ సమావేశమందిరంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌లో మాట్లాడుతున్నాను. కంపెనీ ఆదాయం పెంచుకునే మార్గాలమీద చర్చ జరుగుతోంది. మూడో త్రైమాసిక ఫలితాలు చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. గత ఏదాడితో పోలిస్తే టర్నోవర్ పదిశాతం తగ్గింది. మేము సాధించాలనుకున్న పదిహేనుశాతం వృద్ధి అంచనా తారుమారై ఈ తరుగు శరాఘాతంలా గుచ్చుకుంటోంది.మా కంపెనీ కీళ్ళనొప్పులూ ఒళ్ళునొప్పులూ తగ్గించే క్రీముని తయారుచేస్తుంది. ‘రెండువారాలు వాడి చూడండి, మీ కీళ్ళనొప్పులు తగ్గకపోతే డబ్బు వాపస్’ అనేది మా హెర్బల్ క్రీం ప్రకటనల్లో ప్రముఖంగా కనిపించే ట్యాగ్‌లైన్. ‘ఒళ్ళునొప్పులపాలిట బ్రహ్మాస్త్రం. వాడిన మరుక్షణం నొప్పులు మటుమాయం’ అనేది మరో ట్యాగ్‌లైన్.
నొప్పులు తగ్గించే నూనెలు, క్రీముల్లో రకరకాల ఉత్పత్తులు మార్కెట్‌ని ముంచెత్తుతున్నకాలం కాబట్టి ఆ పోటీని తట్టుకుని మా అమ్మకాలు ఎలా పెంచుకోవాలనే విషయం మీద చర్చ జరిగింది.‘‘అడ్వర్‌టైజ్‌మెంట్లు పెంచితే లాభం ఉంటుందనుకుంటున్నా’’ అన్నాడు సురేష్.‘‘ఇప్పటికే ప్రకటనలమీద చాలా ఖర్చు చేస్తున్నాం. ఏడాది క్రితమేగా ఆర్థోపెడిక్ డాక్టర్‌చేత కీళ్ళ నొప్పులకిది అద్భుతమైనమందు అని అడ్వర్‌టైజ్‌మెంట్ షూట్‌చేసి పేపర్లకీ, టీవీ మీడియాకి విడుదల చేశాం’’ అన్నాడు కమలాకర్.‘‘ఒళ్ళునొప్పుల్ని తగ్గించడంలో వరప్రదాయని అంటూ మరో ఎం.డి. చేత చెప్పిద్దాం’’ అంది నీరజ.‘‘డాక్టర్లవల్ల ప్రయోజనం ఉండదు. ప్రజలు తెలివి మీరిపోయారు.
వరాలిచ్చేది దేవుళ్ళు కాబట్టి ఏ స్వామీజీ చేతనో చెప్పిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. మన ప్రజలకు తెలివితేటల్తో పాటు దైవభక్తి కూడా పెరిగిందిగా’’ అన్నాడు సురేష్. అతను దేవుణ్ణి నమ్మడు.నాకా సలహా బాగా నచ్చింది. హిమాలయాల్లో దొరికే మహిమగల మూలికల్ని తెచ్చి దైవసన్నిధిలో పూజలు నిర్వహించి తయారుచేసిన క్రీం అని స్వామీజీచేత చెప్పించి ఆ ప్రకటన విడుదల చేయాలని నిర్ణయించాం. ఇంతకుముందున్న ఆర్థోక్యూర్ క్రీములతో పాటు అవే మూలికల్తో తయారుచేసిన క్రీంని సంజీవని క్రీంపేరుతో మార్కెట్లో విడుదల చేయాలని సంకల్పించాం.