అనగనగా ఓ పేద బ్రాహ్మణుడు. అతనికి ముగ్గురు కొడుకులు. పెద్దవాడిపేరు యజ్ఞుడు. రెండోవాడిపేరు యజ్ఞకోపుడు. మూడోవాడిపేరు యజ్ఞదత్తుడు. ముగ్గురికీ విద్యాబుద్ధులు నేర్పాడు తండ్రి. యుక్తవయసుకి వచ్చారు వారు. వయసుకి వచ్చిన కుమారులను దగ్గరగా కూర్చోబెట్టుకుని ఇలా చెప్పాడు తండ్రి.‘‘వయసుకి వచ్చిన మగపిల్లలు ఇంట్లో ఉండడం అంటే భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోవడమే! అందుకనే చెబుతున్నాను, ఇక ఇల్లు విడిచి, విశాల ప్రపంచాన్ని విడిది చేసుకుని బతకండి. ప్రయోజకులై తిరిగి రండి.’’సరేనన్నారు ముగ్గురూ. నిత్యకర్మలకు సంబంధించి వస్తువులను మూటగట్టుకున్నారు. ఆ మూటలను భుజాన పెట్టుకున్నారు. చేతికర్రలను పట్టుకున్నారు. బయల్దేరారు. బతుకు గురించీ, భవిష్యత్తు గురించీ రకరకాలుగా ఆలో చిస్తూ ముగ్గురూ మూడు రాదార్ల కూడలికి చేరుకున్నారు. ఒకొక్కరూ ఒకో రాదారిలో నిల్చు న్నారు. అనుకున్నారిలా.‘‘ఏడేళ్ళ తర్వాత ఇదే వేసవి రోజుల్లో మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం. అప్పటికి ఎవరెంత ప్రయోజకులమో తెలుసుకుందాం. అప్పుడే ఇంటికి వెళ్దాం.’’ముగ్గురూ మూడు రాదారుల్లో ప్రయాణించి, ఒకరికి ఒకరు కనుమరుగయ్యారు.పదిరోజులు పాటు ప్రయాణించి ప్రయా ణించి పెద్దవాడు ఓ సైన్యశిబిరానికి చేరుకున్నాడు.
సైన్యంలో చేరాడతను. అక్కడ కర్రయుద్ధం, కత్తియుద్ధం నేర్చుకున్నాడు. యుద్ధవీరుడైనాడు. రాజ్యాలను, ప్రధానంగా కోటలను ఆక్రమించుకునేటప్పుడు యజ్ఞుడిదే ముందడుగు. ఎంత ఎత్తయిన కోటగోడలనైనా ఎక్క గలడతను. దిగడంలో కూడా అతనికి అతనే సాటి. రహస్యంగా కోటలోకి దిగి, కోట తలుపులు తెరిచి, సైన్యాన్ని రప్పించడం, రాత్రికి రాత్రే రాజులనూ, రాజ్యాలనూ స్వాధీనం చేసుకోవడం వెన్నతో పెట్టిన విద్య అయింది యజ్ఞుడికి.రెండోవాడు యజ్ఞకోపుడు నడచి నడచి ఓ రేవు పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ నౌకానిర్మాణకూలీగా జీవితాన్ని ప్రారంభించాడు. నౌకను నిర్మించేందుకు ఎలాంటి కలప పనికి వస్తుంది. ఏ రీతిన వాటిని పలకలుగా చెయ్యాలి. చేసిన తర్వాత వాటిని అమర్చి నౌకను ఎలా రూపొందించాలన్నది బాగా తెలుసుకున్నాడు. నౌకను నిర్మించాలంటే యజ్ఞకోపుడే అన్నట్టుగా పేరుపడ్డాడు.మూడోవాడు యజ్ఞదత్తుడు, అన్నలిద్దరిలా తెలివైనవాడు కాదు. పైగా బద్ధకుడు. కోరికలు కూడా లేనివాడు. దానికి తగ్గట్టుగానే అతను ఓ అడవికి చేరుకున్నాడు. ఆ అడవిలో చెట్లనీ, పుట్లనీ, పక్షులనీ, జంతువులనీ చూసి ఆనం దించసాగాడు. జానెడుపొట్టకోసం, నగరాలను ఆశ్రయించనక్కరలేదనుకున్నాడు. అడవితల్లి ఒడిలోనే హాయిగా ఉందామనుకున్నాడు. ఉండిపోయాడు. ఆకలి వేస్తే పండో కాయో తినడం, దాహం వేస్తే నీరు తాగడం, పక్షుల కూతలనూ, జంతువుల అరుపులనూ అనుకరించడం అలవాటు చేసుకున్నాడు. ఏ అరుపు ఏ జంతువు ఎందుకు అరుస్తుందో, ఏ కూత ఏ పక్షి ఎందుకు కూస్తుందో తెలుసుకోగలిగాడు. తెలుసుకోవడమే కాదు, వాటి భాషల్లో మాట్లాడ సాగాడు. అలా పక్షులతోనూ, జంతువులతోనూ మటామంతీ జరుపుతూ ఒకటేమిటి...చుట్టుపక్కల అడవులన్నీ తిరిగేశాడు. అడవిలో యజ్ఞదత్తుడు మనిషికాడు. పక్షుల్లో పక్షి. జంతువుల్లో జంతువు. అతన్ని చూసి ఇటు పక్షులుగానీ, అటు జంతువులుగానీ భయపడేవి కావు. పైగా దగ్గరగా వచ్చిన అతన్ని పలకరించి కుశల ప్రశ్నలు వేసేవి. అతను పెడితే తినేవి. అతను పాడితే వినేవి. అతను నిద్రిస్తే అతనితో పాటు ఎలాంటి భయాలూ లేకుండా నిద్రించేవి. ఒకొక్కప్పుడు ఆ అడవిలో అలా, ఈ అడవిలో ఇలా అంటూ అతనికి రహస్యాలు కూడా చెప్పేవి. రహస్యాలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు యజ్ఞదత్తుడు. ఏడేళ్ళు గడిపేశాడు అలా.