నాగవరం గ్రామాధికారి భూషణం. ఆ గ్రామంలో భాగ్యవంతుడు రత్నయ్య, బలశాలి భీమయ్య, రైతునేత క్షేత్రయ్య భూషణం మిత్రులు. వాళ్లలో మంచితనం ఏ కోశానాలేదు. వీళ్లంతా ఒక్కటై దుష్టచతుష్టయంగా మారారు. గ్రామస్థుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారిని రకరకాలుగా పీడిస్తున్నారు.
ఒకసారి ఆ ఊరికి సీతాకరుడనే మహామేధావి వచ్చాడు. ఆరోగ్యం పాడైతే గాలి మార్పుకోసం ఏకాకిగా నాగవరం వచ్చాడాయన. ఆయనకి ధర్మసత్రంలో బస దొరకలేదు. మరెక్కడైనా ఉందామంటే, దుష్టచతుష్టయం అనుమతిస్తే తప్ప ఎవరూ తనకి ఆశ్రయమివ్వరని తెలిసింది. ఆయనకి కోపమొచ్చి, సరాసరి గ్రామాధికారిని కలుసుకుని, ‘‘ఇది అనంగదేశమేనా? మహారాజు నెలకొల్పిన ధర్మసత్రంలో ఉండడానికి గ్రామాధికారి అనుమతి కావాలా? ఇక సత్రానికి వేరే అధికారిని నియమించడమెందుకు?’’ అనడిగాడు. అంతవరకూ భూషణానికి ఎదురుపడి అలా అడిగే ధైర్యం చేసినవారు లేరు. మామూలుగా అయితే అలాంటివాళ్లమీద ఆయన మండిపడేవాడు. కానీ సీతాకరుడి ముఖతేజస్సుకి, ఉచ్ఛారణలోని స్పష్టతకు భయపడి. ‘‘అయ్యా, తమరెవరు?’’ అనడిగాడు.
‘‘అనారోగ్యంతో బాధపడుతూ గాలి మార్పుకని ఈ ఊరొచ్చాను. ఇక్కడ చూస్తే ఊరే అనారోగ్యంతో ఉన్నట్లుంది’’ అన్నాడు సీతాకరుడు.‘తనని పరీక్షించడానికి మహారాజు మాధవుడు కానీ ఆయన్ను పంపలేదు కదా’ అని భూషణానికి అనుమానం వచ్చింది. అందుకని వినయంగా ఆయనకు నమస్కరించి, ‘‘అయ్యా! నానాటికీ ధరలు మండిపోతున్నాయి. సత్రం నడపడానికి రాజు పంపే డబ్బు అధికారి జీతానికే చాలడంలేదు. కాబట్టి ఇవన్నీ మీరు పట్టించుకోకండి. మీకు వసతి ఏర్పాట్లు నేను చేస్తాను’’ అంటూ తన మిత్రుడు క్షేత్రయ్యకు కబురు పెట్టాడు. క్షేత్రయ్య పరుగునవచ్చి విషయం గ్రహించేక, సీతాకరుడికి చేతులు జోడించి, ‘‘అయ్యా తమరాక మా ఊరి అదృష్టం. మాఊళ్లో రామన్న అనే పుణ్యాత్ముడున్నాడు. అతిథి మర్యాదలకు పెట్టింది పేరు. మీరు ఎన్నాళ్లు ఉండాలనుకుంటే ఆన్నాళ్లూ, అతడింట్లో ఉండవచ్చు’’ అన్నాడు. సీతాకరుడు ప్రసన్నుడై సరేనని రామన్న ఇంటికి వెళ్లాడు.