పాపం పందిరి....కాయటం తెలీదు. పూయటం తెలీదు. చిగుళ్ళు వేసే యోగం లేదన్న చింతే లేదు. తన పాదాల దగ్గర మొలకెత్తిన పాదుని పైపైకి తీసుకు వెళ్తుంది. అల్లుకుపోయిన ఆకుల్నీ, తీగెల్నీ వాటేసుకుని పచ్చగా పలకరిస్తుంది. పువ్వులూ, కాయల బరువుతో ఎముకలగూడు ఊగిపోతున్నా సంతోషంగా భరిస్తుంది. పందిరిని చూసినప్పుడల్లా బెలగాం సెంటర్లో మజ్జి గౌరమ్మ గుర్తుకొస్తుంది.
ఇప్పటివాళ్లకి తెలీదుగానీ, వెనకటి తరాల వాళ్ళను అడగండి మజ్జిగౌరమ్మ గురించి, బోలెడన్ని కబుర్లు చెప్తారు. బెలగాం సెంటర్‌కి పశ్చిమంగా ఉండే అగ్రహారం, చర్చివీధుల్లో మజ్జిగౌరమ్మ గురించి తెలియని వాళ్ళు అసలు ఉండేవారే కాదు. ఎప్పుడు చూడండి, మనిషి ఒంటరిగా కనిపించేది కాదు. పిల్లలకోడిలాగా బడి పిల్లలమధ్యే ఉండేది. ఆవిడ చదువుకోలేదుగానీ, చదువుకునే పిల్లలకి ఆ తల్లి చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. వెనక్కి తిరిగి ఇప్పుడు లెక్కలువేస్తే గనక ఆ పిల్లల్లో చాలామందికి షష్టి పూర్తులు కూడా జరిగిపోయి ఉంటాయి.
మజ్జి గౌరమ్మ అప్పుడే బట్టీలో కాల్చి తీసిన ఇటుకరంగులో- సన్నగా, పొడుగ్గా పొట్లకాయలాగా ఉండేది. శుభ్రంగా నూనె రాసి, నున్నగా దువ్విన తల, ఓ వారగా ముడివేసిన కొప్పు, కాళ్ళకి కడియాలు, ముక్కుకి వేలాడుతూ నత్తు, నుదుటి మీద, మోచేతుల మీద పచ్చబొట్లు, ఓ చేతిలో బెత్తం, మరో చేతిలో పలకా పుస్తకాల దొంతర, పిల్లల్ని నడిపిస్తూ, ముతకరకం బొబ్బిలి నేతచీరలో నడిచే జటాయువులాగా కనిపించేది. ఆవిణ్ణి ‘గర్ల్స్ స్కూల్ మజ్జిగౌరమ్మ’ అనే వారంతా!బెలగాం చర్చి వీధి చివార్న ఉంది గర్ల్స్ స్కూల్. బ్రిటిష్ దొరలకాలంనాటి బడి. దొరలు ముందుచూపుతో కేవలం ఆడపిల్లల కోసం ఆ బడిని పెట్టారంటారు.
బడిపెట్టడంతో ఐపోలేదు. బెలగాంలోని ఆడపిల్లలంతా ఆ బడికి వచ్చేలాగా అప్పటి అధికార్లు ఏర్పాట్లు చేశారట. అందులో భాగంగానే పాఠాలు చెప్పడానికి లేడీ టీచర్లనీ, బడికి పిల్లల్ని రప్పించేందుకు ‘లేడీ కండక్టర్ల’నీ నియమించారని చెప్తారు. అలా చాలాకాలం క్రితం గరల్స్ స్కూల్లో లేడీ కండక్టర్ ఉద్యోగంలో చేరింది మజ్జిగౌరమ్మ. కొన్నాళ్ళకి ఆ బడిలో అబ్బాయిల్ని కూడా చేర్చుకోవడం మొదలుపెట్టినా, ‘గర్ల్స్ స్కూల్’ పేరు చాలాకాలంపాటు ఉండిపోయింది.