ప్రతి మనిషీ తన జీవితానికి ఒక మంచి తోడు కావాలని కోరుకుంటారు. తన కష్టాలు, బాధలు, ఆనందసంతోషాలు పంచుకునే ప్రియనేస్తం కావాలని కోరుకుంటారు. అలాంటి ప్రియనేస్తం ఒక మంచి కుటుంబీకుడైతే తన జీవితానికి భరోసా ఉంటుందని కోరుకుంటుంది ఏ ఆడపిల్ల అయినా. అలాంటి కోరిక చేతికి అందీ అందని ద్రాక్షపండులా మారిపోతే...! ఈ కథలో లత జీవితం కూడా అంతే. చెట్టునుంచి రాలిపడిన ఆకులా ఆమె ఎంత విలవిలలాడిపోయిందో. కానీ..
పనసపొట్టు కూరపెట్టి అమ్మ ఇచ్చిన బాక్స్ తీసుకుని రావుగారింటికి నడిచాను.ఎప్పుడూ పెరటి తలుపువైపునుంచి వెళ్ళడమే అలవాటు. వాళ్ళ వీధిగుమ్మం ఇంటివాళ్ళ హాల్లోకి ఉండడంతో ఊరెళ్ళినప్పుడుతప్ప ఇంట్లో దాదాపు అందరూ పెరటిగుమ్మంవైపునుంచే మసులుతారు. నేను తలుపుతోసుకుని వంట ఇంటి గుమ్మంవైపు వెళ్ళాను.రావుగారిభార్య శేషారత్నంగారిని నేను అత్తయ్యగారు అని పిలుస్తాను. వాళ్ళ అమ్మాయిల్ని అక్క అని పిలుస్తాను. మొదటనుంచి అలా అలవాటైపోయింది ఎందుకో. వినేవాళ్ళు అదేం వరసరా అనేవాళ్ళు నన్ను. ఆరోజు ఆశ్చర్యంగా శేషారత్నంగారు గుమ్మానికి అడ్డంగా ఒక తలుపును ఆనుకునినిలబడి రెండవ తలుపుని ఒకకాలుతో నిగడదన్ని నిలబడి శేఖర్ అన్నయ్య మాటలకి కాబోలు నవ్వుతోంది. లత కూడా శృతి కలిపింది.
శేఖర్, లత ఆవిడకు కొంతదూరంలో చెరోకుర్చీలో కూర్చున్నారు. శేఖర్ నా పెద్దమ్మకొడుకు. మెడికల్ రిప్రజంటేటివ్. మూడేళ్ళక్రితం ఓ ఏడాది మా ఇంట్లోనే ఉండి చదువు వెలగబెట్టాడు. రావుగారి పెద్దమ్మాయి లత. రెండో అమ్మాయి వర్ధని నా క్లాసుమేట్.నన్నుచూడగానే లతక్కముఖం మాడిపోయింది. అత్తయ్యగారు గతుక్కుమన్నారు. శేఖరన్నయ్య అయితే ముఖాన నెత్తురుచుక్కలేదు.‘‘అమ్మ పనసపొట్టుకూర ఇచ్చిరమ్మందండీ’ అని అత్తయ్యగారికి బాక్స్ ఇచ్చి ‘‘ఎంత సేపైందిరా ఊళ్ళోకి వచ్చి? ఇంటికి రాలేదేమి?’’ అన్నాను నాకు విషయం తెలియక.‘‘అంకుల్గారికి మందులు ఇవ్వాలిగా! దారే కదా అని ఇటు వచ్చేశానురా. మందులు ఎలా వాడాలో చెప్పి వచ్చేస్తాను’’ అన్నాడు.‘‘అక్కర్లేదు. నాకు చెప్పావుగా, నేను ఆయనకు చెబుతాలే. నువ్వెళ్ళు శేఖర్. మళ్ళీ పిన్నిగారు కంగారుపడతారు’’ అంటూ వాడికి వెళ్ళు వెళ్ళు అన్నట్టుగా ఏదో సైగ చెయ్యబోయి లోపలికి వెళ్ళిపోయారు రత్నం అత్తయ్యగారు.