భర్త ఇంట్లోలేనప్పుడు ఆఫీసర్లు ఇంటిమీద దాడిచేశారు. బంగారం తనిఖీ చెయ్యాలి, బీరువాలు తెరవండని పీకలమీద కూర్చున్నారు. కాళ్ళల్లో నిప్పులు పోసేశారు. కూర్చోనీయలేదు. నించోనీయలేదు. ఆలోచించుకునే వ్యవధి అసలే ఇవ్వలేదు. తాళాలు లేవని అబద్ధం చెబితే బ్రేక్‌ చేసైనాసరే లెఖ్ఖ రాసుకుపోతాం, అంతే! అన్నారు. ఆ ఇంటి ఇల్లాలికి ఏం చేయాలో తోచలేదు. తాళాలు వాళ్ళకిచ్చేసి ప్లీజ్‌...ప్లీజండీ...అని బ్రతిమాలడం ప్రారంభించింది. సరిగ్గా అప్పుడు

**************************

టకటక...!.టకటక...!తలుపు చప్పుడికి మెలకువ వచ్చిన కస్తూరి ఒక్క ఉదుటన మంచందిగివెళ్ళి తలుపు తెరచింది. అపరచితుల్ని చూసి ప్రశ్నార్థకంగా చూసింది.‘‘మీ ఇంట్లో బంగారం ఎంత ఉందో తనిఖీచేయటానికి వచ్చాం’’‘‘ఇంట్లో మగవాళ్లెవ్వరూ లేరు. ఆయన వచ్చాక అప్పుడు రండి, నేనే మీకు ఫోను చేస్తాను’’.‘‘అవన్నీ కుదరవమ్మా. మేం వచ్చినప్పుడు మీరు మాతో సహకరించాలి. లేకపోతే మా తనిఖీలతోపాటు మీకు శిక్ష కూడా పడుతుంది’’ అంటూనే లోపలికి వచ్చేశారు ఆ వచ్చిన నలుగురూ.ఇంకేమీ ఆలోచించుకునే అవకాశంలేని కస్తూరి అయోమయానికి గురైంది. ఏడుపు తన్నుకు వస్తున్నది. ఒక్కక్షణం మా వారికి ఫోను చేస్తాను. బీరువా కీస్‌ ఆయన దగ్గరే ఉన్నాయి’’.‘‘కీస్‌ లేకపోతే బ్రేక్‌ చేస్తాం. ఆయన వచ్చేదాకా ఉండాలంటే మాత్రం కుదరదు. మీరు ఫోను చేసుకుంటే చేసుకోండి మాకేం అభ్యంతరం లేదు.

కానీ మాకు మీ గోల్డ్‌ అప్పచెప్పి ఆయనకు ఫోన్‌ చేసుకోండి. మాకు చాలాచోట్ల తనిఖీలు ఉన్నాయి. త్వరగా వెళ్లిపోవాలి. డూప్లికేట్‌ కీస్‌ ఉన్నాయా? పగలుగొట్టడమేనా?’’ అంటూనే పక్కనతన్ని చూశాడు. అతగాడు బ్యాగ్‌లోనుంచి ఏవో పరికరాలు బయటకు తీశాడు.‘‘ఉండండి. ఒక్కసారి చూస్తాను. ఒకవేళ ఇవ్వాళ ఇంట్లోనేపెట్టి వెళ్లారేమో!’’అంటూ లోపలికి నడిచింది కస్తూరి.‘‘ఉంటాయిలే చూడమ్మా! కంగారుపడాల్సిన పనేమీలేదమ్మా. మేమేమీ మీ బంగారం ఎత్తుకుపోవమ్మా. ఎంత ఉందో రాసుకుని మీ సంతకం చేయించుకుని వెళ్తాం అంతే’’.‘‘మాకేం పెద్దగా లేదండీ. ఇవిగో కీ‍స్‌ ఉన్నాయిఇలే, బీరువా పగులుగొట్టకండి. కాస్త కనిపెట్టి రాయండి సార్‌.మేం పెద్దగా ఉన్నవాళ్లమేమీ కాదండీ..’’బ్రతిమిలాడటం మొదలుపెట్టింది కస్తూరి. ‘‘ప్లీజ్‌...ప్లీజండి... ప్లీజండి... మాకేంలేదండీ...’’‘‘కస్తూరీ, కస్తూరీ...ఏంటా కలవరింతలు’’ అంటూ భార్యని తట్టిలేపాడు నరసింహం.