బేతాళుడు ఎక్కడ దొరుకుతాడో వెతికి పట్టుకుని, తోకుచ్చుకుని, బండకేసి బడా బడా ఉతకాలనుంది ఆమెకి. తన మొగుడికిస్తే బాగా ఉతకుతాడేమో అనుకుంది. కానీ, ఆయనకున్న ఆ చేతులు ఆయనవి కాదు కాబట్టి, బాగా ఉతికేఅవకాశం తక్కువే అని కూడా అనిపించింది.
ఆలోచనల్లో పడి, పొయ్యిలో మంట తగ్గటం చూసుకోలేదు. దబదబ కాసిన్ని చెదలు పట్టిన తాటాకుల్ని గుత్తుగా చేసి, పొయ్యిలోకి తోసింది. నిప్పు అందుకుంది. టప డుబు చిట పట అంటూ తాటాకులు శబ్దాలు చేస్తున్నాయి.ఆ శబ్దాలు అచ్చం విక్రమార్కుడు, బేతాళుడి గొంతుల్లా అనిపించాయి. ‘ఏం చేయాలా?’ అని ఆలోచనల్లో పడింది. ఆమె చుట్టింట్లో వంట చేస్తోంది. దానికి పదిహేను అడుగుల దూరంలో బావి ఉంది. అక్కడ స్నానం చేస్తున్న మొగుడు వీపు రుద్దించుకోటానికి పిలిచాడు. ఆమెకి తిక్క లేచింది. పొయ్యి దగ్గర నుండి కూడా లేచింది.ఆ ముందు రాత్రి చుట్టింటి చూరులో దూర్చిన బాదం ఆకుల పొట్లం తీసి, దాన్ని ఆ పాట్నే పొయ్యిలో వేసింది. నిప్పంటుకోగానే, ఆకు కొనల మీద తేటదేరి పచ్చటి ఆకు ముడుచుకుపోతోంది. ఆకు లోపల ఉన్న కాడలు తెగిన కనకాంబరాలు కూడా అంటుకుంటున్నాయి.
కొంగు నోట్లో కుక్కుకుని, కాలుతున్న ఆ పచ్చటి ఆకుని, కనకాంబరాలని చూస్తూ పొయ్యి ముందు కూలబడింది.తన మొగుడు కోసిన కనకాంబరాలు అవి. ప్రతీ రోజూ సాయంకాలం అయ్యేసరికి ఆమె అత్త పోసుకోలు కబుర్లు చెప్పటానికి ఊరు మీదకి బైలుదేరేది. అత్త అట్ల వాకిలి దాటేదో లేదో, మొగుడు దబదబ కనకాంబరాలు కోసి, అరటి నార తీసి, పూలని అల్లేవాడు. రాత్రి తను పక్క మీదకి చేరగానే, ఆ మాల ఇచ్చేవాడు.ఏనాడూ ఆమె దాన్ని తలలో పెట్టుకునేది కాదు. మాలని సాగతీసి, పొడుగు చేసి, అతని మెడలో వేసేది. నల్లటి అతని దేహం మీద ఆ పూలమాల పగడాల దండలా ఉండేది. తెల్లారేసరికి, తెల్లటి ఆమె మెడ మీద కూడా అన్నే పగడాల గుర్తులు ఉండేవి.