రాజేందర్‌కు పదేపదే అదే విషయం మనస్సులో మెదలసాగింది. తను అలా అనాల్సిందికాదు. తను అలా అన్నానని జయపాల్‌రెడ్డికి తెలిస్తే పెద్ద గొడవౌతుందేమో. జయపాల్ చాలా కోపగొండి. షార్ట్ టెంపర్డ్ ఫెలో. అతడు చాలా త్వరగా సంయమనం కోల్పోతాడు. కోపమొస్తే అతడు మనిషికాదు. జంతువులా ప్రవర్తిస్తాడు. ఎదుటివాణ్ణి బూతులు తిట్టేస్తాడు. తనను కూడా అలా తిట్టేస్తాడేమో!
క్లబ్‌లో చాలామంది కూర్చొని పేకాట ఆడుతున్నారు. పేకాడుతూ ఏవేవో కబుర్లు.... చెత్తకబుర్లు... పరమచెత్త కబుర్లు... ఫలానావాడి భార్యకు ఫలానావాడితో సంబంధం ఉందని, దాని భర్త పరమదద్దమ్మ అనీ, వాడి భార్య వాడి ఫ్రెండ్‌తోటే వ్యభిచరించినా మెదలకుండా నోరుమూసుకుని ఉంటాడనీ, ఇంకొకడెవడో పెద్ద ఉమనైజర్ అనీ, వాడికి చాలామంది ఆడవాళ్ళతో సంబంధం ఉందనీ, వాడు ఎవరెవరితో కులికాడో వాళ్ళపేర్లు....ఇలా స్త్రీలను గూర్చి చీప్‌గా మాట్లాడుతూ చాలామంది పురుషులు ఏదో పిచ్చి ఆనందం పొందుతుంటారు.తను చాలాసేపు మౌనంగానే ఉండిపోయాడు. కానీ విషయం అకస్మాత్తుగా జయపాల్ భార్యమీదకు మళ్ళింది. జయపాల్ భార్య చాలా అందంగా ఉంటుంది. వాళ్ళిద్దరి కాపురం సజావుగానే సాగుతోంది. జయపాల్ భార్య ఎం.ఎస్.సీ. ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణురాలైంది.
ఆ ఊళ్ళో ఉన్న ఉమెన్స్ కాలేజిలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. జయపాల్ నీటిపారుదల శాఖలో ఇంజనీరింగ్ పని చేస్తున్నాడు. తను కూడా విమెన్స్ కాలేజీలోనే లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు కాబట్టి జయపాల్ భార్య స్వరూప తనకు బాగా తెలుసు. ఆమె అంటే తనకో ఆరాధనభావం కూడా ఉంది. అందుకు కారణం ఆమె చాలా అందంగా ఉండటం కావచ్చు లేదా చాలా డిగ్నిఫైడ్‌గా ఉండటం కావచ్చు. ఆమె కెమిస్ట్రీ లెక్చరర్‌గా విద్యార్థినులందరి అభిమానం పొందటం కావచ్చు. ఎంత కష్టమైన, క్లిష్టమైన అంశాల్ని కూడా ఆమె చాలా సులభతరంచేసి విద్యార్థినులకు అర్థం చేయిస్తుందని చెప్పుకుంటారు. ఆ కాలేజీలో ఆమెకున్నంత మంచి పేరు మరెవరికీ లేదు.