విజయవాడవెళ్లే హడావిడిలో ఉన్నాడు సాకేత్‌. బ్యాగ్‌లో బట్టలు సర్దుకుని మేడమీదనుంచి కింద హాల్లోకి వచ్చాడు. వందన అతని వెనుకే వచ్చింది హాలుల్లోకి.‘‘విజయవాడ వెళ్తున్నావట గదా!’’ అడిగాడు అక్కడే నిలబడిన అనంతయ్య.‘‘అవును నాన్నా, ఆఫీసు పనిమీద అర్జంటుగా విజయవాడ వెళ్లాల్సివచ్చింది. అక్కడ మా కంపెనీ మరో యూనిట్‌ పెట్టబోతోంది. స్థలం లీజుకి తీసుకుని బిల్డింగ్‌ కట్టించేపని కాంట్రాక్టర్‌కు అప్పగించాలి, వారంరోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది’’ అన్నాడు.

సాకేత ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో హెచ్‌.ఆర్‌ విభాగాధిపతి. నెలకు లక్షరూపాయలు జీతం. మల్టీనేషనల్‌ కంపెనీలో మెరుగైన జీతంతోపాటు పనిభారం కూడా ఎక్కువే.‘‘మీ దగ్గర క్రెడిట్‌ కార్డ్‌, సెల్‌ఫోన్‌ ఉన్నాయో లేదో చెక్‌ చేసుకోండి, అవి ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లిరాగలరు’’ తండ్రివైపు నుంచి అతని దృష్టి మళ్లించే ఉద్దేశ్యంతో అన్నది వందన.తండ్రితో భర్త ఎక్కువసేపు మాట్లాడడం ఆమెకు ఇష్టం ఉండదు. ఎందుకంటే, వాళ్లిద్దరూ ఒకేకంపెనీలో పనిచేశారు. ప్రేమించుకున్నారు. పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. అనంతయ్య మొదట్లో అభ్యంతరం చెప్పాడు. తర్వాత కొడుకు మనసు తెలుసుకుని సర్దుకుపోయాడు.

కోడలికి మాత్రం మామగారి మీద ఇంకా ఆ కోపం పోలేదు. సాకేత్‌, వందన పైపోర్షన్‌లో ఉంటారు. క్రింద పోర్షన్లో అతని తల్లిదండ్రులుంటున్నారు.‘‘రాఘవ నీకు తెలుసుకదా! నాకు ఆత్మీయ స్నేహితుడు. వాడుండేది విజయవాడలోనే. ఈ కాగితంలో రాఘవ అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌ ఉన్నాయి. వీలు చూసుకుని వాడింటికి వెళ్లిరా!’’ అడ్రస్‌ కాగితం కొడుకు చేతిలోపెట్టి చెప్పాడు అనంతయ్య.‘‘మీ అబ్బాయి ఆఫీసుపనిమీద వెళ్తుంటే మీ స్నేహితుణ్ణి కలవమని చెప్తారెందుకు? అంత ఆప్తమిత్రుడైతే అతనే మీదగ్గరకొచ్చి చూసివెళ్లేవాడు కదా! లేకపోతే మీరే విజయవాడ వెళ్లి అతన్ని చూడొచ్చుగదా!’’ అంది వందన.