పది రోజుల క్రిందట....సుజాత ఫోన్‌చేసి ‘‘నాగార్జునసాగర్‌లో వచ్చేనెల రెండవ శనివారం, ఆదివారం కలుపుకుని, ‘గెట్‌ టుగెదర్‌ మీట్‌’ ఏర్పాటుచేశాం. నువ్వూ రావాలి. ఇంకొక్కరోజు సెలవుపెట్టి, మూడురోజులు పర్మిషన్‌ తీసుకుని రా’’ అన్నది.

తను చెప్పినట్లే, ఆ రోజుకి సాగర్‌లోని హిల్‌కాలనీకి చేరుకున్నాను చిన్ననాటితలపుల్ని నెమరువేసుకుంటూ. ఇంటర్మీడియట్‌ వరకూ నేను చదువుకున్నది అక్కడే. ఆపైన అక్కడ కాలేజీ లేకపోవడంతో చదువునిమిత్తం ఊరు వదిలిపెట్టవలసి వచ్చింది.నలభైఏళ్ల తరువాత మళ్ళీ చిన్నప్పటి స్నేహితుల్ని కలుసుకోవడం కోసం బయలుదేరాను. ఇలాంటి అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.ఎందుకంటే మంచో, చెడో బయటకు వెళ్ళినవాళ్ళు, ఆ హడావిడి ప్రపంచానికి అలవాటుపడిపోయి ఆ ఉరవడిలో కొట్టుకుపోతారేగానీ, స్తబ్దుగా కాలంకదలనట్టుండే సాగర్‌కి మళ్ళీ వచ్చి ఉండాలని అనుకోరు.ఇప్పుడు అక్కడ ప్రాజెక్టు కట్టడం పూర్తైపోవడంతో పెద్దగా పనులులేవు. అభివృద్ధి అసలే లేదు. ఎప్పుడో గవర్నమెంటువాళ్ళు కట్టించిన ఇళ్ళరంగులు వెలిసిపోయి, వెలాతెలాపోతూ, గతకాలం వైభవాన్ని గుర్తుచేస్తున్నాయి.

అంతకంతకూ ఉద్యోగస్తులు తగ్గిపోయి, కట్టిన ఇళ్ళు ఖాళీగా ఉండిపోవడంతో, ఇరవైఏళ్లపాటు ఒకేఇంట్లో ఉన్నవాళ్ళకి ఆ ఇంటిని స్వంతంగా ఇచ్చేశారు. హక్కుదారులకి ఇంటి స్వరూప, స్వభావాల్ని మార్చే వీలులేదు. అందుకే ఎలా ఉన్న ఊరు అలాగే మిగిలిపోయింది.బయటప్రపంచం, జాతీయరహదారులవెంట జట్‌వేగంతో దూసుకుపోతూ, బహుళఅంతస్తుల ఆకాశహర్మ్యాలు ఆకాశంవైపు తలెత్తి చూస్తుంటే, సాగర్‌లోమాత్రం అలాంటి దృశ్యం కనిపించదు.

వాణిజ్యం, వ్యాపారం అంటే అస్సలు తెలీదు.అయితే, వానాకాలంలో కృష్ణానది ఎగువ ప్రాంతాలనుంచి వరదనీరు వచ్చి చేరినప్పుడు దిగువప్రాంతాల పంటభూములకు నీరు అందించడం కోసం, నీటిపారుదలశాఖవాళ్ళు ప్రాజెక్టులో ఉన్న అన్నిగేట్లూ పైకి ఎత్తేస్తారు. అప్పుడు కృష్ణమ్మ పరవళ్ళుతొక్కుతూ పైనించికిందికి దూకుతుంది. నీరు పల్లమెరుగు...అన్నట్టుగా, అది ఎంత వేగంగా కింద పడుతుందో మళ్ళీ అంతే వేగంగా పైకి లేస్తుంది. తెల్లటి పాలనురగలా మెత్తటి దూదిపింజలా చూడ మనోహరంగా ఉంటుంది ఆ దృశ్యం.