సాయంత్రం ఐదున్నర. బ్రీఫింగ్ పాయింట్. మెత్తగా కోసేసే మంచు కత్తిలాంటి చలి. శీతాకాలం చివరి దశలో ఉంది కాబట్టి కాస్త నయమే.నెల క్రితం పరిస్థితి మరింత దుర్భరంగా ఉండేది. కశ్మీర్ లోయ అంతా మంచు దుప్పటి కిందే ఉంటుంది. ఎటు చూసినా మంచే. స్నో కట్టర్లతో మంచును చీల్చుకుంటూ మా బళ్లు ముందుకు వెళుతుంటాయి.
ఇప్పుడైనా టెంపరేచర్ ఐదు, ఆరు డిగ్రీలే అనుకోండి! స్వెట్టర్‌పై షర్ట్ ఆపై బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, హ్యాండ్ గ్లోవ్స్, తలను కప్పుతూ హెల్మెట్ ఎలాగూ ఉంటుంది. కాస్త దూరంగా నిప్పు కుంపటి కూడా ఉంది.మా పహరా టీమ్ హెడ్‌తో పాటు కంపెనీ కమాండర్, ఇంకా దిగువ ర్యాంక్ అధికారులందరూ ఉన్నారు. అంటే కీలకమైన అసైన్‌మెంట్ ఏదో ఉందన్నమాట.ఆకు కదిలినా వినిపించేటంత నిశ్శబ్దం. పహరా టీమ్ లీడర్ చెప్పే పొజీషన్ ఆర్డర్స్ పాటించిన తర్వాత అసలు విషయం చెప్పారు.‘‘సోల్జర్స్ ... పింగ్లాన్ అనే గ్రామంలో ఓ ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు ఆశ్రయం పొంది ఉన్నారన్న సమాచారం వచ్చింది. మనకు అందిన రహస్య సమాచారం ఎంత వరకు వాస్తవమో నిర్ధారించుకోవాలి... అది ముగ్గురు కావచ్చు ఇద్దరు కావచ్చు లేదా నలుగురు ఉండొచ్చు.
ఆ ఇంటికి ఎలా వెళ్లాలి, ఇంటి ప్లాన్ ఎలా ఉంటుంది అనేది ఫైజల్ వివరిస్తాడు.’’మేమందరం చేతులు వెనక్కి పెట్టుకుని పొజీషన్‌లో నిలబడి ఉన్నాం. అందరూచెవులు రిక్కించి వింటున్నారు. స్థూలంగా ఏం చేయాలో మాకు స్పష్టత వచ్చేసింది. ఎలా చేయాలన్న అంశం పైనే దృష్టి.ఎవరెవరు ఎక్కడ ఉండాలి? ఎప్పుడు ఉండాలి? ఎంత సేపు ఉండాలి? ఏం చేయాలి? ఒకరి మధ్య ఒకరికి సమన్వయానికి పాటించాల్సిన సంకేతాలు, ఆపరేషన్ పేరు... అన్నీ ఐదే ఐదు నిమిషాల్లో మాకు వివరించారు.
తర్వాత ఫైజల్ ఆ ఊరి మ్యాప్, ఆ ఇంటి ప్లాన్, కిటికీలు, తలుపులు, బాల్కనీ వరకు ... అన్నీ వివరించాడు. సరిగ్గా అర్ధరాత్రి ఒంటి గంటకు మేము బయలు దేరాలి.ఇటువంటి ఆపరేషన్లు నాకు కొత్త కాదు. అయినా మనసులో ఉత్కంఠగానే ఉంది. ఎందుకంటే ప్రతి ఆపరేషన్ దేనికదే ప్రత్యేకం. శత్రువు నక్కిన ప్రాంతం, దాని భౌగోళిక స్వరూపం, గ్రామస్థుల ప్రతిఘటన, శత్రువు వ్యూహం, వారి సంఖ్య, వాళ్ల జాతీయత వంటి అనేక అంశాలు ఆపరేషన్ విజయంపై ఆధారపడి ఉంటాయి.