బస్సు వేగంగా దూసుకుపోతోంది. రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు పచ్చదనాన్ని కోల్పోయి ధూళిని నింపుకున్నాయి. రోజూ నీరుపెట్టే పంటపొలాలు మాత్రం పచ్చనికాంతులీనుతూ కనువిందు చేస్తున్నాయి.అరవైఏళ్ళ తరవాత పుట్టిపెరిగిన నా ఊరుకి వెళ్తుంటే మనసు ఆనందంతో చిన్నపిల్లలా గంతులు వేస్తోంది. బాల్యంతాలూకూ అనుభవాలు నా స్మృతిపథంలో మొదలవగానే మనోదర్పణంలో ఒక్కొక్క సంఘటనా క్రమంగా ప్రతిబింబించనారంభించాయి.
అన్నయ్యల చదువులకోసం నాన్న నరసాపురంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారు. అక్కడ అన్నయ్యలు, నేను, మాతోపాటు అమ్మ ఉండేది. ఎప్పుడెప్పుడు పరీక్షలవుతాయా? ఎప్పుడెప్పుడు సెలవలిస్తారా? ఎప్పుడు భీమలాపురం వెళ్ళి వాలిపోదామా? అనిపిస్తూ ఉండేది మాకు.అందరిలోకీ నేనే చిన్న. ఆడపిల్లలకోసం కొత్తగాపెట్టిన స్కూల్లో చదివేదాన్ని. అన్నయ్యలిద్దరూ హైస్కూల్లో ఆరు, ఏడు క్లాసుల్లో ఉండేవారు. పరీక్షలైన రోజే సాయంకాలం భీమలాపురం ప్రయాణం కట్టేవారు అన్నయ్యలు. నా పరీక్షలు అప్పటికి ఒక్కోసారి అయ్యేవికాదు. అయినా చిన్నతరగతుల స్కూళ్ళల్లో పిల్లల్ని అప్పుడంతగా పట్టించుకునేవారు కాదు.
రోజూ క్లాసులో బాగాచదివే పిల్లలు పరీక్షకి రాకపోయినా పాస్ చేసేసేవారు.పరీక్షలు ఏ రోజు అవుతాయో ముందుగాతెలిస్తే అన్నయ్యలు నాన్నగారికి ఫలానారోజుకి వస్తున్నామని ఉత్తరం రాసేవారు. ఆ రోజుకి నాన్నగారు పడవ అబ్బాయితోచెప్పి దొడ్డిపట్లలో పడవ ఉండేటట్లు చేసేవారు.ఆ రోజుల్లో కరెంటు, టెలిఫోన్లు, టీవీలు, ట్రాన్సిస్టర్‌లు ఏవీలేవు. ఓ మోస్తరుగా ఉండే నరసాపురంలోనే ఏ సౌకర్యాలూ లేనప్పుడు ఇక భీమలాపురం సంగతి చెప్పేదేముంది? వెడల్పు తక్కువగా ఉండే ఆ మట్టి రోడ్లమీద బస్సులు కాదు కదా! గుర్రపు బళ్ళు, ఎడ్లబళ్ళు కూడా ఉండేవి కావు. నరసాపురం రైలుస్టేషన్, బస్‌స్టాండ్ దగ్గర మాత్రం రెండోమూడో ఎద్దుబళ్ళు, గుర్రపుబళ్ళు ఉండేవి. నడవలేని వాళ్ళు ఎక్కేవారు.