విదేహ దేశ రాజకుమారి త్రిపురసుందరి. పేరుకుతగ్గట్లే త్రిపురసుందరి అతిలోక సౌందర్యవతి.ఆమె అందచందాలగురించి విని, ఎందరో రాజకుమారులు ఆమెను వివాహమాడాలని మనసుపడ్డారు. ఆ విషయం విదేహరాజుకి తెలియజేస్తూ తమ చిత్రపటాలు పంపారు. రాజు ఆ చిత్రపటాలన్నీ కుమార్తెకు చూపించాడు. వాటిని చూసిన త్రిపురసుందరికి వరుణ్ణి ఎన్నుకోవడం చేతకాలేదు. ఆమె తండ్రితో, ‘‘ప్రేమ మనసులోంచి పుడుతుంది. నా మనసుకునచ్చే పనిచేసి, నా మనసులో ప్రేమ పుట్టించిన రాజకుమారుణ్ణి నేను వివాహం చేసుకుంటాను’’ అన్నది.

‘‘నీ మనసుకు నచ్చే పనేమిటి?’’ అనడిగాడు రాజు.‘‘నాకు తెలియదు. అదీ నన్ను పెళ్ళి చేసుకోవాలని కోరుకునే రాజకుమారుడే తెలుసుకోవాలి’’ అన్నది త్రిపురసుందరి.‘‘అలా చెబితే రాకుమారులకు కోపమొస్తుంది. నీ కారణంగా, వివిధదేశాలతో శత్రుత్వం తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను స్వయంవరం ప్రకటిస్తాను. వచ్చినవారిలో ఒకరిని నీవు ఎన్నుకోవాలి’’ అన్నాడు రాజు తన కుమార్తెను మందలిస్తూ. త్రిపురసుందరి తండ్రికి ఎదురాడలేక, అప్పటికి ఊరుకుంది. ఆ తర్వాత, ఆమె తన ఇష్టసఖి చంద్రలేఖతో తన బాధ చెప్పుకున్నది.చంద్రలేఖకు పద్మనాభుడనే ప్రియుడు ఉన్నాడు. అతడు చంద్రలేఖను పెళ్ళి చేసుకుంటానని అంటున్నాడు.

అతడికి చతుష్టష్టి కళలలోనూ ప్రవేశముంది. రాకుమారిబాధ గురించి పద్మనాభుడికి చెప్పింది చంద్రలేఖ. అతడు అది విని, ‘‘నేను ఒక మరమనిషిని తయారు చేస్తాను. వాడు చూడ్డానికి అచ్చం మనిషిలాగే ఉంటాడు. కత్తియుద్ధంలో వాణ్ణి ఎవ్వరూ ఓడించలేరు. ఆ మరమనిషిని నేను రాజకుమారికి అప్పగిస్తాను. వాణ్ణి కత్తియుద్ధంలో ఓడించిన వారినే రాజకుమారి వివాహం చేసుకుంటుందని ప్రకటిస్తే, సరిపోతుంది’’ అన్నాడు.చంద్రలేఖ ఈ విషయం త్రిపురసుందరికి చెప్పింది.

ఆమె తండ్రితో, ‘‘రాజ్యంలో కత్తియుద్ధంలో తిరుగులేని మహావీరుణ్ణి ఎన్నుకోండి. ఆ మహావీరుణ్ణి ఓడించిన రాకుమారుణ్ణి నేను వివాహం చేసుకుంటాను’’ అంది. రాజుసరేనని, ఆ విధంగా స్వయంవరం ప్రకటించాడు, దేశంలో కత్తియుద్ధం పోటీలకు ప్రకటన చేశాడు. ఈలోగా చంద్రలేఖ పద్మనాభుడు తయారుచేసిన మరమనిషిని తీసుకొచ్చి రాకుమారికిచ్చింది.