అర్థరాత్రి అయినట్లుంది. శీతాకాలం చలి అన్ని ప్రాణులను గడగడలాడిస్తోంది. పక్కనే ఉన్న అడవిలోని నక్కలు ఊళలు పెడుతున్నాయి. గుడ్లగూబలు అప్పుడప్పుడూ అరుస్తున్నాయి. కరెంట్‌ పోయినట్లుంది. గదిలో బెడ్‌లాంప్‌ నీలి వెలుతురుకి బదులు కర్కశమైన చీకటి అలుముకుని ఉంది. మనిషిలోని రాక్షసత్వానికి, కరడుగట్టిన స్వార్థానికి ప్రతీకలాంటి చిక్కటి చీకటి గది అంతటా పరుచుకుని ఉంది.

మంచంపైన పడుకుని ఉన్న కాళింద్‌కి తన ఊపిరి తనకే భారంగా వినిపిస్తోంది. తలుపు కిర్రుమన్న శబ్దం. లోపలికి ఎవరో వచ్చినట్లున్నారు. గుసగుసలుగా మాట్లాడుతున్నట్లున్నారు. వారిలో ఒకరు తన కాళ్ళవైపు, మరొకరు తలవైపుకి వెళ్ళారు. తనకాళ్ళపైన రెండు చేతులు. ముందు మెల్లగా, కానీ అంతలోనే గట్టిగా ఉడుము పట్టులా పట్టుకున్నాయి. ఆ చేతులకున్న మట్టిగాజులు సవ్వడిచేసాయి. అవి అతనికి పరిచయం అయిన సవ్వడిగానే ఉంది. తలవైపు ఉన్న వ్యక్తి అతని మొఖంపైన మెత్తటి తలదిండు అదిమిపట్టాడు తలవైపు ఉన్న వ్యక్తి. యువకుడిలా ఉన్నాడు బలంగా నొక్కి పట్టాడు. కాళింద్‌ కాళ్ళు కొట్టుకుంటున్నాయి. కాళ్ళవైపు ఉన్న స్త్రీ తన కాళ్ళు కదలకుండా ఉంచడానికి కష్టపడుతోంది. ఆమె చేతిగాజుల శబ్ధం ఇప్పుడు మరీపెద్దగా స్పష్టంగా వినిపిస్తోంది.కాళింద్‌కి ఊపిరి అందడం లేదు. గాలి పీల్చుకోవడం తప్ప మరో మఖ్యమైన పని ఏదీలేదు ఆ క్షణంలో అతనికి. తలదిండు నొక్కి పట్టుకున్న చేతులను తోసేయాలని చూసాడు. ఆ చేతులను పట్టుకుని తోసేస్తూ ఉంటే ఆ వ్యక్తి కుడిచేతికి ఉన్న కడియం ఒకటి స్పర్శకు తెలిసింది. అది కూడా బాగా పరిచయమైనదిగానే ఉంది.

తనను ఇలా చంపాలని చూస్తుంటే తన వాళ్ళెవరూ రారేం?? తన భార్య రూపవతి, కొడుకు బిట్టు ఎక్కడ?? ఏం చేస్తున్నారు?? మెల్లమెల్లగా కాళింద్‌ శక్తి వీగిపోతోంది. మృత్యువు వైపుకి అతన్ని ఎవరో బలవంతంగా తోసేస్తున్నారు. అప్పుడు గుర్తుకొచ్చింది అతనికి ఆ గాజుల శబ్ధం రూపవతిది అని. ఆ చేతి కడియం బిట్టూకి తను ఎంతో ప్రేమతో కొనిచ్చిన బంగారు కడియం అని.ఒక్క ఉదుటున మెలుకువ వచ్చింది కాళింద్‌కి. చటుక్కున మంచంపై లేచి కూర్చున్నాడు. మొఖమంతా చెమటలతో తడిచిపోయి ఉంది. పక్కకి చూసాడు. అతని మంచం పక్కనే మరో చిన్న మంచంపై భార్య రూపవతి పెద్ద రజాయి కప్పుకుని నిద్రపోతూ ఉంది. గదిలో ఒక మూల ఎలక్ట్రిక్‌ రూమ్‌హీటర్‌ వేడిని విరజిమ్ముతోంది. గది బయట గడగడలాడించే చలి. నుదురు తుడుచుకున్నాడు కాళింద్‌. ఇంత చలిలో తనకు అంతగా చెమటలు పట్టించిన ఆ భయంకరమైన కల గుర్తుకి రాగానే మరోసారి ఒళ్ళంతా కంపించిపోయింది.