చావులోనూ, బతుకులోనూ మనిషి కోరుకునేది ప్రేమ, గౌరవం..ఈ రెండే. కానీ అలాంటి గొప్ప ప్రేమ గౌరవాలను దక్కించుకునేది కొంతమందే. ఈ కథలో భాగ్యమ్మ కూడా 80యేళ్ళు బతికింది. కుటుంబాన్ని విస్తరించింది. అందరికీ మూలకేంద్రంగా భాసిల్లింది. ఇప్పుడు పది రోజులుగా అంతిమ ఘడియల్లో కొట్టుమిట్టాడుతోంది భాగ్యమ్మ. కళ్ళు తెరచి చూడకపోయినా ఆమెకు తన చుట్టూ జరుగుతున్న అంతర్నాటకం తెలుస్తూనే ఉంది. అదేమిటంటే..
భాగ్యమ్మకి నిస్సత్తువగా నీరసంగా ఉంది. లేచి రెండడుగులు వేసే ఓపిక కూడా లేదు. శరీరం అంతా వెయ్యి సుత్తులతో మోదుతున్నట్టుంది.ప్రాణం పోవటానికి కూడా ఇంత కష్టం ఉంటుందా? పుట్టినప్పుడు కూడా ఉంటుందిట. కానీ పుట్టాక మరపు ఉంటుంది. మరణం కూడా మనిషికి బాధ లేకుండా ఒక కట్ ఆఫ్ డేట్‌తో జరిగితే బావుండు. ఆలోచించేశక్తి కూడా లేక కళ్ళు మూసుకుని ఒత్తిగిలింది భాగ్యమ్మ. అయినా మనసు ఊరుకుంటుందా! జీవితపు మలిదశలో గతం పేజీలను వద్దన్నా తిరగేస్తూనే ఉంటుంది.
అమ్మపోయిన ఏడాదిలోపే పిన్నిని తీసుకొచ్చిన నాన్న, ఆమె నోటికి కట్టుబడిపోయాడు. తను అవన్నీ భరించింది. ఆ బాధలు దాటుకుని వచ్చి, తనకంటే వయసులో పదేళ్లు పెద్దవాడైన హనుమంతయ్యని పెళ్ళి చేసుకుంది. అప్పటినుంచి పెనంమీంచి పొయ్యిలోకి పడినట్లయింది తన జీవితం. ఉమ్మడికుటుంబంలో పెద్దకోడలుగా అలవాటులేని బండచాకిరీ చేసింది. బాధ్యతల్ని బరువు అనుకోకుండా మోసింది. పెళ్ళికాగానే మాయమైన పుట్టింటిని మరచిపోయేందుకు విఫలయత్నం చేసింది.అత్తింట్లో భర్తసహా ఎవరిప్రేమా దొరక్కపోయినా వ్యసనపరుడైన భర్త, స్వార్థపరులైన ఆడపడుచులు, గయ్యాళి అత్త పెట్టే ఆగడాల్ని తను కన్న పిల్లలకోసం భరించింది. వాళ్ళని పెంచిపెద్దచేసింది. వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేసి నిట్టూర్చింది. తాగి తాగి పక్షవాతం వచ్చి మంచానపడిన భర్తకు సేవలుచేసి ఒడ్డున పడేసింది. తన కోటి కలల్ని చిదిమేసి భయపెట్టిన ఏకైకవ్యక్తి భర్త అనేపేరుతో తన జీవితాన్ని గాలానికి గుచ్చిన చేపని చేశాడు. అతను పోయినప్పుడు మాత్రం పట్టరాని ఆనందం కలిగింది. కానీ దాన్నీ ప్రకటించే స్వేచ్ఛాపంజరానికి తలుపుల్లేవు.ఎనభై ఏళ్ళుగా యంత్రంలా పనిచేస్తున్న తన శరీరం అలసిపోయింది. విశ్రాంతి కావాలని హృదయం ఘోషిస్తోంది. ఈ శిథిలశరీరాన్ని వీడిపోయేందుకు ఆత్మ అలజడి సృష్టిస్తోంది. శిథిలాలయంలో కొడిగడుతున్న దీపం ఎంత వెలుగును ప్రసరించగలదు మరి!