జీవి పుట్టిందంటే మరణం తథ్యమని అర్థం. కానీ మరణానంతరం జీవితం ఉందా? ఆ తర్వాత మనం ఏమవుతాం? అనే ప్రశ్న ప్రతివారిలోనూ మిగిలిపోయింది. అందుకే మరణంపైన పెద్ద పెద్ద పరిశోధనలు జరుగుతున్నాయి. చరిత్రపుటల్లో ఎంతోమంది సజీవసమాధిలోకెళ్ళి ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు. కానీ ఈ కథలో మాత్రం ఆ స్వాములోరు మరణాన్ని మరోరకమైన ప్రయోగంగా మార్చాడు. జనానికి సైకలాజికల్‌ థెరపీ చేస్తాడు. అదెలాగంటే.....

**************************

స్కూలు నుంచి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని ఇంటి వసారాలో ఉన్న వాలుకుర్చీలో కూచున్నాను. సరిగ్గా అప్పుడే పోస్ట్‌మేన్‌ వచ్చి ‘‘శివరాం మీరేనా సార్‌’’ అన్నాడు.‘‘అవును’’ అన్నాను.పార్శిల్‌ చేతికిచ్చి అక్‌నాలెడ్జ్‌మెంటు రసీదులో సంతకం పెట్టించుకుని పోస్ట్‌మేన్‌ వెళ్లిపోయాడు.‘‘స్వామి! చింతలతోట’’ అన్న ఫ్రమ్‌ అడ్రసు చూసి ‘స్వామి నుంచి ఉత్తరం వచ్చి ఎన్ని రోజులైంది’ అనుకుంటూ ఆతృతతో పార్శిల్ విప్పి చూశాను. అందంగా ముద్రించిన పుస్తకం కనిపించింది.‘గాంగేయ గాయాల గేయాలు’ అట్టపైనున్న అక్షరాలు చూసి ‘ఎంత బావుంది’ అనుకున్నాను.పుస్తకం తెరవగానే ఒకపేజీలో, ‘కష్టాలు దుఃఖాలు లేకున్న జీవితమున కమ్మదనమే లేదు’, అనే వాక్యం, మరో పేజీలో, ‘దుఃఖాలు నాలోనే దిగులుపడినాయి – భావాలు నాలోన గాయాలు బరువైయున్నాయి – అవి గేయాలై మీకు తెలుపమన్నాయి’’ అననే గేయ భాగాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి.

మరో గేయం నా గుండెను కలుక్కుమనిపించింది.‘పుట్టిన నాడు నవ్వినవారు – కని సాకినవారుచచ్చిననాడు ఏడ్చినవారు వారేరి?వారు వీరు కూడా..ఈ కాల వాహినిలో కలిసిపోయారే?ఒకరికొకరు ఎవ్వరూ లేరునమ్మితే నీకు నీవే తోడుతప్పదు ఒకనాడు చక్కని గుంత తోడు’.ఆ గేయాల్లోని తాత్వికత నాగుండెను పిండేసింది. నాలో ఏదో సంచలనాన్ని రేకెత్తించింది. గతంలో అముద్రితదశలో ఉండగా, ఈ రాతప్రతులు చూసినప్పుడు ‘దీన్ని ముద్రించండి. మీకు కొంచెం ధనసహాయం చేస్తాను’ అంటే స్వామి సున్నితంగా తిరస్కరించడం, గంగయ్య గాంగేయస్వామిగా మారిన విషయం అన్నీ గుర్తుకొచ్చాయి.

********************

అతని అసలు పేరు గంగయ్య. ఊరు చింతలతోట. నా కొలీగ్‌ నారాయణ స్వామి ఆ ఊరివాడే. నేను మొట్టమొదట గంగయ్య గురించి విన్నది ఆ కొలీగ్‌ ద్వారానే.