కూతురికి ఇటీవలె పెళ్లయింది.. కొద్ది రోజులకే అల్లుడు అమెరికా వెళ్లిపోయాడు.. ఉద్యోగమంటూ కూతురు కూడా వేరే సిటీలో ఉంటోంది.. వీసా వచ్చేస్తే కూతురు కూడా అమెరికాకు వెళ్లిపోతుంది అనుకున్న తల్లికి ఊహించని షాక్. సడన్‌గా ఓ రోజు రాత్రి కూతురి నుంచి ఫోన్.. అసలు కూతురు తన భర్త గురించి ఏం చెప్పింది.. ఆ తల్లి నిర్ణయం ఏమిటి.?

************************* 

 

సాయంకాలం స్కూలునుంచి వచ్చేసరికి అత్తగారు గుమ్మంలోంచే, ‘‘అరుణా, రేపు మీ లేడీస్‌ క్లబ్‌ వాళ్ల మీటింగుందట, ఇందాక వాళ్లంతా వచ్చి చెప్పివెళ్లేరు. మళ్లీ మర్చిపోతానేమోనని ముందే చెప్పేస్తున్నా’’ అన్నారు నవ్వుతూ. ఆవిడకి లేడీస్‌ క్లబ్‌ మీటింగ్‌ అంటే భలే సరదా. తమతరంలో ఇలాటివేవీలేవని నిట్టూరుస్తుంటారు. ఎప్పటికప్పుడు నన్ను వెళ్లమని, నలుగురితో కలిసి, నాలుగు విషయాలు తెలుసుకోమని ప్రోత్సహిస్తుంటారు.ఇంతలో ఝాన్సీ, వాళ్ల పక్కింటి పండుగాడు ‘ఆంటీ’ అంటూ పరుగెత్తుకు వచ్చారు. ‘నేనంటే, నేను’ అని కాస్సేపు ఒకళ్లని ఒకళ్లు తోసుకుంటూ నాకేదో చెప్పాలని, తమ చేతుల్లో వస్తువుల్ని చూపించాలని గొడవ పడ్డారు. ఆఖరికి ఝాన్సీ ‘‘ఉండరా, నాకు ఎక్కువ బహుమతులు వచ్చాయిగా’’ అంటూ బాలల దినోత్సవం కోసం పెట్టిన పోటీల్లో తను గెలుచుకున్నవన్నీ చూపించింది. అంతేకాకుండా ఎప్పటిలాగే ఆ నెల పరీక్షల్లో కూడా తనకే ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్పింది. పండు కూడా తనకి ఆటల్లో నాలుగు బహుమతులు వచ్చాయని చెప్పాడు. 

ఒక్క బహుమతి మాత్రం రాజేష్‌కి తనే ఇచ్చేసేనని చెప్పాడు. ‘‘ఎందుకిచ్చావ్‌?’’ అన్నాను.‘‘మరేమో ఆంటీ, ఈసారి ఆటల్లో బహుమతులొస్తే డబ్బులిస్తారని టీచరుగారు చెప్పారు. రాజేష్‌ వాళ్లమ్మకి చెప్పుల్లేవంట. రాజేష్‌ గెలిస్తే వాళ్లమ్మకి చెప్పులు కొంటానన్నాడు. అందుకే పరుగుపందెంలో వాడికంటే నేను నెమ్మదిగా పరుగెత్తాను’’ నిండా పదేళ్లు లేని ఆ పసివాడు స్నేహితుడి కోసం చేసిన త్యాగం నాకు నచ్చింది. ‘గుడ్‌’ అంటూ వాణ్ణి మెచ్చుకునేంతలో,ఝాన్సీ కాస్త అసహనంగా, ‘‘ఆంటీ, నేను సమీరక్కలాగా బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తా’’ మార్కులు తెచ్చి, చూపించిన ప్రతిసారి తన జీవితాశయం చెబుతుంది.

పండుగాడు వంత పాడాడు. ‘‘నీకు అన్నీ సున్నాలే కదేంటీ. మంచి ఉద్యోగమెలా వస్తుంది?’’ ఝాన్సీ ఆరిందలా అంది. ‘‘ఎక్కాల్లో నేనే ఫస్టుగా’’ అన్నాడు తడుముకోకుండా. వాడి ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. ఝాన్సక్కలాగా తను కూడా బహుమతులు సంపాదించాడు మరి.పండుగాడు మూడోక్లాసుకొచ్చినా అన్నీ తప్పులు రాస్తున్నాడు. నోటిలెక్కలు మాత్రం ఇట్టే చెబుతాడు. రాత పట్టుబడాలంతే. వాడి బుగ్గలు తట్టి, ఫ్రిజ్‌ లోంచి ఇద్దరికీ కమలా పళ్లు తీసిచ్చాను. వచ్చినంత వేగంగానూ వెళ్లిపోయారు. అత్తగారు నవ్వుతూ ‘‘భలే గడుసువాడే పండుగాడు. సున్నాలకి భయపడడు, తనకి చేతనైనవేంటో వాడికి బాగానే తెలుసు’’ అన్నారు.