తండ్రి నెంబర్ నుంచి అర్ధరాత్రి అమెరికాలో ఉన్న కూతురికి ఫోన్ వచ్చింది. ‘మీ నాన్న చనిపోయారమ్మా.. వీలయినంత త్వరగా రండి..’ అన్న ఒక్క మాటే ఆమెకు వినిపించింది. తల్లి చనిపోయాక తమ వద్దకు రమ్మన్నా రాని నాన్నను తలచుకుని ఆమె బాధపడుతూనే ఉంది. దిక్కూమొక్కూ లేని అనాథ శవంలా నాన్న పార్థీవ దేహం ఉండి ఉంటుందని రోదిస్తూనే ఉంది. ఆ ఆలోచనలతోనే అమెరికా నుంచి సొంతూరికి వచ్చింది.. కానీ అక్కడ కనిపించిన దృశ్యం చూసి.. 

******************************** 

లాన్లోని ఊయలలో కూర్చుని లాప్టాప్‌ తెరిచి ఓ వైపు మెయిల్స్‌ చెక్‌ చేస్తున్నా, మరోవైపు నా చూపు మాత్రం ఎదురింటి ‘నేపాలీ జంట’ మీదనే ఉంది.చాలా సేపటినుండీ వాళ్ళను గమనిస్తూనే వున్నాను. ఆ అంకుల్‌ వాళ్ళావిడకి పూలు కోసిస్తూ ఏవో కబుర్లు చెప్తుంటే ఆవిడ అందంగా నవ్వుతూ ఆ పూలు అందుకుంటూ వుంది. చూడ్డానికి ఆ దృశ్యం ఎంత ముచ్చటగా ఉందో! ఈరోజే కాదు ... బయటికొస్తే చాలు, నాకు తెలియకుండానే నేను వాళ్ళింటి వైపు దృష్టి సారిస్తాను.వాళ్ళని చూస్తే ఎవరికైనా చూడచక్కని జంట అనిపిస్తుంది. ఆ ఇంటిని బయటి నుండి చూస్తేనే ఇద్దరి అభిరుచి ఎంత గొప్పగా ఉందో ఇట్టే తెలిసిపోతుంది.ఇంటి కాంపౌండ్‌ వాల్‌ నేమ్‌ ప్లేట్‌పై కూడా వాళ్లిద్దరి పేర్లూ అందంగా ఇంగ్లీష్‌లో చెక్కి ఉంటాయి.ఈ వయసులో కూడా కళకళలాడుతూ, పక్షులకు గింజలేస్తూనో ... గార్డెనింగ్‌ చేస్తూనో, పేపర్‌ చదువుతూనో.. సరదాగా కబుర్లు చెప్పుకుంటూనో కనిపిస్తారు.ఆ అంకుల్‌ వయసు దగ్గర దగ్గర మానాన్న వయసే ఉంటుంది. ఆయన్ను చూస్తే ఏదో పెద్ద హోదాలోనే పని చేసి రిటైర్‌ అయినట్లని పిస్తుంది.

పరిచయం లేకున్నా ఎందుకో వాళ్లంటే ఏదో తెలియని అభిమానం ఏర్పడింది.ఎపుడైనా నేను ఎదురుపడితే జస్ట్‌ ఒక చిన్న స్మైల్‌తో నన్ను విష్‌ చేస్తారు. నేనూ అంతే! అసలే నాకు కలివిడితనం లేదు. ‘హాయ్‌’ అంటే ‘హాయ్‌’ అంతే. అంటీ ముట్టనట్లుంటాను. పైగా నాకు భాష సమస్య కూడానూ.‘అసలు ఆ అంకుల్లా ప్రతీ భర్తా ప్రేమగా కాస్త సమయం కేటాయిస్తే ఆ భార్య ఎంత సంతోషంగా ఉంటుందో కదా’ అనుకోగానే అప్రయత్నంగా నాకు మా నాన్న గుర్తొచ్చాడు.

********************

పాపం అమ్మ, బతికున్నన్ని రోజులూ ఎంతగా బాధపడేదీ! ‘‘మీ నాన్నకి ఇల్లు తప్ప ప్రపంచమంతా కాబట్టుద్ది. అన్ని పనులూ నేనే చేసుకోలేక చచ్చిపోతున్నా! కాసేపన్నా ఇంటి పట్టున అస్సలుండడే’’ అని తెగ బాధపడేది.నిజమే! నాన్న మాతో ఇంట్లో కాసేపు సరదాగా గడిపిన జ్ఞాపకాలే లేవు. నాన్న చేసేది బట్టల కొట్టులో చిన్న గుమస్తా ఉద్యోగం. తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులు ఏవీ లేవు. స్వశక్తితో దినదినమూ బట్టల కొట్టుతో పాటూ తానూ వృద్ధిలోకి వచ్చాడు. నాన్నలాంటి నమ్మకమైన మనిషి దొరకడని వాళ్ల యజమాని నాన్నను ఎంతో ఆదరంగా, ప్రేమగా చూసేవాడు. అయితే ఆ నిజాయతీనీ, అభిమానాన్నీ సొమ్ము చేసుకోవాలని నాన్న ఏనాడూ అనుకోలేదు.