‘‘సదువుకుంతన్నారు కదా, నీ కెందుకు సిన్నపంతులూ ఇయన్నీ? ఒగ్గీసి అటింక యెల్లండి’’ అని కంబార్లు చనువుగా మందలించినా బాసుబాబు వినేవాడు కాదు. ‘‘ఎల్లండెసె....’’ అని గసిరి తలకి తువ్వాలు చుట్టుకునేవాడు. మోకాళ్ళదాకా బొందులాగు వేసుకుని, మునకాల కర్ర పట్టుకునేవాడు. బుగతలా గట్టుమీద కూర్చుని గదమాయించకుండా, ఎంతో ఇష్టంగా, మరెంతో నిష్ఠగా పొలంలోకి దిగేవాడు.
బాసుబాబుకి ఎద్దుల్ని, పోతుల్ని ఏ భాషలో అదిలించాలో తెలుసు. పాలుపితికే ముందు ఆవునో, గేదెనో ఎలా మచ్చికచేసుకోవాలో తెలుసు. ఏరు పూయడం, దుక్కి దున్నడం, నొల్లతోలడం, గూడ వెయ్యడం, దమ్ముపట్టడం, పార పని, తోట పని, ఏతామెక్కడం లాంటివన్నీ బాసుబాబుకి బాగా తెలుసు. కుర్రాడిగా ఉన్నప్పుడే అతగాడు వీటిని ఒడిసి పట్టాడు. చూలుతో ఉన్న పశువుని చూసి ఎప్పుడు ఈనుతుందో చెప్పేసేవాడు. కోతలకి సిద్ధంగా ఉన్న పొలాల్ని చూసి, ఎన్ని గరిసెలు ధాన్యం దిగుబడి రావచ్చో, వాన వెలిశాక ఎన్ని మడికట్లు కురిసి ఉండొచ్చో కచ్చితంగా అంచనా వేసేవాడు. నూర్పిడి సమయంలో కుప్పలకీ, కాపు సమయంలో మామిడి తోటకీ కంబార్లతో కలిసి కాపలా కాసేవాడు.
అలాగే చెరువులో జనపకర్ర నానబెట్టి గోగునార తీసినప్పుడూ, అమ్మవారి చెరువు గట్టుమీద బెల్లం గానుగ ఆడినప్పుడూ స్కూలునుంచి వస్తూనే, మిత్రుడు పాలంకి నాగేశ్వరరావుతో కలిసి డబుల్స్ తొక్కుతూ బెలగాం సెంటర్ మీదుగా వెంకమ్మపేట కి సైకిల్ మీద వెళ్ళిపోయేవాడు.బెలగాం సెంటర్‌కి రెండు కిలోమీటర్ల దూరంలో వెంకమ్మపేట ఉంది. అగ్రహారం వీధి లాయర్ లక్ష్మాజీరావు గారికి అక్కడ వ్యవసాయం ఉండేది. చెరువు దిగువున పొలాలు ఉండేవి. ఊళ్లో పెద్ద కళ్ళం, గడ్డి కుప్పలు, పాకలు, నాగళ్ళు, నాటు బళ్ళు , పలుపులు, కొరడాలు, మువ్వల పట్టీలు, చిట్టు, తెలకపిండి బస్తాలు, పశువులు, కుడితి గోలేలు ఉండేవి. గోర్జి లోంచి వెళితే వెనకాల పెద్ద మామిడి తోట ఉండేది. వీటన్నిటినీ కనిపెట్టుకుని కంబార్లు ఉండేవాళ్ళు. లాయర్‌గారి రెండో అబ్బాయి బుచ్చిబాబు లాగే మూడో అబ్బాయి బాసుబాబు కూడా కంబార్లతో కలిసి పొలం పనులు నేర్చుకున్నాడు.