పసితనంలో పది సంవత్సరాలే పచ్చని ప్రకృతితో మమేకమై ప్రశాంతంగా, ఆనందంగా జీవించడం.పుట్టి బుద్ధెరిగాక ఐదేళ్ళు వచ్చేవరకూ ఇళ్ళు గుడిసెల మధ్యనుంచి ఎటుచూసినా పెద్ద పెద్ద చెట్లు, పచ్చని పొలాలు, దూరదూరంగా కొండలు లేదా గుట్టలు, వాటి వెనుకగా అటూ ఇటూ ఎగబడి, దిగబడే ఎర్రని సూర్యుడు. ఎటుచూసినా ప్రశాంత వాతావరణంతో కూడిన ప్రకృతి.
పిల్లల్ని నీళ్ళవైపు వెళ్ళనీయకుండా పెద్దలు కట్టడిచేసే వారంతే! ఎందుకంటే పల్లె చుట్టుతా బావులు, ఈశాన్యంలో పెద్దచెరువు, పల్లె మధ్య వేణుగోపాలస్వామి గుడి ముంగిట పెద్ద కోనేరు!ఐదో ఏట నుంచి పదో ఏడు వచ్చేవరకూ పక్క ఊరి ప్రాథమిక పాఠశాలలో చదువుకోసం పచ్చని ప్రకృతిమధ్య కాలిదారిలో నడకే! ఆ నడకదారిలో ఎంత పచ్చదనమో? సౌందర్యమో? కళ్ళకూ మనసుకూ అంత ఆనందం!ఐదోతరగతయ్యాక ఆరవతరగతి నుంచి స్కూల్‌ఫైనల్ పూర్తయ్యేదాకా అంకిపాడు మిట్టకిందివరకూ నడిచేవాళ్ళం. పుస్తకాలసంచి, అన్నం క్యారియర్‌తో వలీసాబ్ బస్సెక్కి పండ్రెండుమైళ్ళ అవతల రాజాపురంరోడ్‌లో దిగేవాళ్ళం. అక్కడినుంచి హైస్కూలుకెళ్ళేవాళ్ళం. సాయంకాలం రామా ట్రాన్స్‌పోర్ట్ బస్సెక్కి అంకిపాడుమిట్టకింద దిగడం...ఊరు దారిపట్టడం! ఈ కార్యక్రమంలో ప్రకృతికి కాస్త దూరమవడం, యాంత్రిక జీవనానికి కొద్దిగా అలవాటు పడడం ప్రారంభమైంది.
ఇక ఘటోత్కచపురం కాలేజీలో ప్రీ–యూనివర్సిటీ కోర్సులో చేరి హాస్టల్‌లో అడుగుపెట్టడంతో నాకు, ప్రకృతికి మధ్య బాగా ఎడం పెరిగిపోయిందని చెప్పవచ్చు.డిగ్రీ చేతికొచ్చేసరికి నా చదువుకోసం అక్కా, చెల్లి వివాహాల కోసం చేసిన ఖర్చులకు మా పొలంలో సింహభాగం హారతి కర్పూరమైపోయింది. నామ మాత్రం పొలం, రాతిమిద్దె మిగిలాయి. అందువల్ల నేను ఉద్యోగం కోసం వేట మొదలుపెట్టక తప్పలేదు.వెతికితేతప్ప పచ్చదనం కన్పించని సిమెంటు కాంక్రీటు కీకారణ్యంలాంటి బస్తీ జీవితంలో ఉద్యోగపర్వం ప్రారంభమయ్యాక నిలదొక్కుకోవడం కోసం ఒక పోరాటం చెయ్యాలి. ఆ పోరాటంమధ్యలోనే పెద్దల కోరిక తీర్చడం కోసం వివాహం, ఆపై జీవన పోరాటం... ఇంకెక్కడి ప్రకృతి?!