మైక్రోస్కోపులోకి దీక్షగా చూస్తున్న నిత్య తలుపు దగ్గర సవ్వడికి తలెత్తి చూసింది.‘‘హలో నిత్యా!’’ మాట వినిపిస్తోంది కానీ, లేబొరేటరీలో చీకటిగా వుండడం వల్ల సరిగ్గా కనిపించలేదు. తలుపు దగ్గరున్న యువతి లోపలికొచ్చింది.‘‘బాగున్నారా? నన్ను గుర్తుపట్టారా? మీరా.. మూడేళ్ళ కింద బెంగుళూరు ట్రైనింగులో కలిశాం’’ నవ్వుమొహంతో చెప్తోందామె.‘‘ఓ, యస్‌! సారీ, చాలా కాలమైంది కదా, కొంచెం గుర్తుపట్టడం లేటయింది. పైగా, మైక్రోస్కోపులోకి చూస్తూ రోజంతా గడుపుతానా, బయట వెల్తురుకి అడ్జస్ట్‌ అవడానికి టైం పడుతుంది’’ మాట్లాడుతూనే నిత్య మైక్రోస్కోపు దగ్గర్నించి లేచి లైటు వేసి, తన డెస్కు దగ్గరికి నడిచింది. కుర్చీలో వున్న కాగితాలూ, డెస్కు మీద వున్న పుస్తకాలూ నోట్‌ బుక్కులూ అన్నీ పక్కకి జరిపింది. మీరాని కూర్చోమని సైగ చేసింది.బ్యాగు పక్కన పెట్టి కూర్చుంది మీరా.‘‘ఎప్పుడొచ్చారు ఈ ఊరు?’’‘‘చిన్న పనిమీద నిన్న వొచ్చాను నిత్యా. మీ ల్యాబ్‌ ఇక్కడే అని తెలిసి పలకరించి పోదామని వొచ్చాను.’’‘‘సో నైస్‌ ఆఫ్‌ యూ! వుంటారా కొద్ది రోజులు?’’‘‘లేదు నిత్యా. రేపే బెంగుళూరు వెళ్ళిపోతున్నాను.

 ఇది మీకు బిజీ టైమా? డిస్టర్బ్‌ చేస్తున్నానా?’’గడియారం చూసుకుంది నిత్య. ‘‘ఇప్పుడు బిజీ కాదులే కానీ, పది నిమిషాల్లో ఒక మీటింగుకెళ్ళాలి. అది ముగిసేసరికి లంచ్‌ టైం అవ్వొచ్చు. ఇద్దరం కలిసి లంచ్‌ కెళ్దామా? ఒక రెండు గంటలు వెయిట్‌ చేయగలరా, లేక మీకింకేదైనా పని వుందా?’’‘‘కలిసి లంచ్‌ చేద్దాం. నేనీ రెండు గంటలూ లైబ్రరీలో కూర్చుంటాను. మీ మీటింగవ్వగానే నాకు మెసేజ్‌ ఇవ్వండి, నేను బయటికొచ్చేస్తాను. ఆఫీసు మెసెంజర్‌ నేను మొబైల్లో చెక్‌ చేస్తూనే వుంటాను’’ వుత్సాహంగా అంది మీరా.‘‘ఎక్స్‌లెంట్‌! లంచ్‌ టైంలో కలుద్దాం.’’ఇద్దరూ బయటికొచ్చారు.ల్యాబ్‌ నుంచి బయటికొచ్చి లైబ్రరీలోకెళ్ళింది మీరా. చేతికందిన పుస్తకం తీసుకొని ఒక డెస్కు దగ్గర కూర్చుంది. చేతులు పేజీలు తిప్పుతున్నాయి, కళ్ళు పంక్తుల వెంట నడుస్తున్నాయి, కానీ మనసు మాత్రం నిత్యతో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకుంది.

**********

అయిదేళ్ళ క్రితం, కరోనా ఇంకా పంజా విసరని రోజుల్లో, తమ సంస్థ బెంగుళూర్లో ఏర్పాటు చేసిన శిక్షణలో కలుసుకున్నారు వాళ్ళిద్దరూ.