అతడొక సంగీత విద్వాంసుడు. గొంతులో గంధర్వగానం పలికించగల విద్వన్మణి. గురువులకు శుశ్రూషలుచేసి నేర్చుకున్న అతడి విద్య వృథాకాకూడదన్నడే అతని తండ్రి కోరిక. పైగా ఆ తండ్రి ఆత్మకు శాంతిచేకూరాలంటే ఆ విద్వన్మణి మయూర ద్వీపం చేరుకోవాలి. తండ్రి చెప్పిన కార్యం పూర్తిచేసేందుకు సిద్ధమయ్యాడు విద్వన్మణి. కానీ మయూరద్వీపానికి వెళ్ళే దారి అతడికి తెలియలేదు. అప్పుడతను ఏం చేశాడు? ఎలా తెలుసుకున్నాడు?
పూర్వం ఒకానొక గ్రామంలో నాదానందుడనే యువకుడు ఉండేవాడు. చిన్నప్పటినుంచీ అతడికి సంగీతం అంటే ప్రాణం. నాదానందుడి తండ్రి గీతానందుడు గొప్ప సంగీత విద్వాంసుడు. అయితే, అతడు ఎన్నడూ గ్రామం వదిలి వెళ్లలేదు. ఆ ఊరివారికి తప్ప వేరెవ్వరికీ అతడి సంగీత విద్యా ప్రావీణ్యం గురించి తెలియదు.నాదానందుడికి ఇంకా ఐదేళ్ళైనా నిండకముందే అతడి తండ్రి గీతానందుడు ప్రమాదవశాత్తూ మరణించాడు. తనే తల్లీ, తండ్రీ అయి నాదానందుణ్ణి పెంచింది తల్లి భారతి. అయితే, నాదానందుడికి సంగీతంమీదతప్ప మరో ఆసక్తి ఉండేదికాదు. అతడికి చదువు రాలేదు. కొడుకు భవిష్యత్తు గురించి భారతి బెంగ పెట్టుకుంది. ఆ సమయంలో ఒకరోజున భారతికి కలలో భర్త కనిపించి, ‘‘భారతీ, నాదానందుడికి సంగీతం చెప్పించు. వాడి భవిష్యత్తుకు ఏ లోటూ ఉండదు’’ అన్నాడు.భారతికి మెలకువ వచ్చి, తన కల గురించి కొడుక్కు చెప్పింది.
నాదానందుడు ఉత్సాహపడి, ‘‘అమ్మా, ఈ రోజే నగరానికివెళ్లి మహాపండితులకు శుశ్రూష చేసి, సంగీతం నేర్చుకుని వస్తాను’’ అన్నాడు. భారతి సరేనని అతణ్ణి ఆశీర్వదించి పంపింది.నాదానందుడు నగరం వెళ్లి పేరుపొందిన సంగీత విద్వాంసుడు రుద్రభట్టును కలుసుకున్నాడు. రుద్రభట్టు అతణ్ణి పరీక్షించి, ‘‘నీ ముఖంలో సరస్వతి ఉంది. గాత్రంలో నాదబ్రహ్మ ఉన్నాడు. నిన్ను నా శిష్యుడిగా చేర్చుకుంటాను’’ అన్నాడు.మూడు మాసాల్లో నాదానందుడు రుద్రభట్టు దగ్గర సంగీతం పూర్తిగా నేర్చుకున్నాడు. అప్పుడు రుద్రభట్టు అతడితో, ‘‘నాయనా, నీ గ్రహణశక్తి అద్భుతం. నేర్పగలిగినదంతా నీకు నేర్పాను. అయితే, నీ విద్యాభ్యాసం పూర్తి కావడానికి నీవు సమీపారణ్యంలోని మహాగాత్రుడి ఆశ్రమానికి వెళ్లవలసి ఉంది’’ అన్నాడు.