‘‘జ్వాలా, తలనొప్పిగా ఉంది. కాస్త టీ పెట్టి ఇవ్వు’’ అంటూ ఇంట్లోకి వస్తూనే కుర్చీలో కూర్చుని తలపట్టుకున్నాడు శ్రీధర్.టీ చేతికందిస్తూ, ‘ఐతే వెళ్ళినపని కాలేదన్నమాట. ఎక్కడా డబ్బు దొరకలేదాండీ’’ అంది జ్వాల.‘‘లేదు జ్వాలా యాభై వేలు కాదు కదా, కనీసం పదివేలు కూడా అప్పు పుట్టలేదు. ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావడం లేదు’’ అన్నాడు శ్రీధర్.
జ్వాల, శ్రీధర్‌లది ముచ్చటైన సంసారం. వారి పాప దివ్య. ఫోర్త్ క్లాస్. శ్రీధర్ చిన్న వ్యాపారిగా ప్రారంభమై క్రమంగా ఎదుగుతూ వచ్చాడు. లాభాల బాటపట్టి ఓ సొంత ఇల్లు కట్టుకున్నాడు. ఇక భవిష్యత్తుకు డోకా లేదనుకుంటున్న తరుణంలో, ఓ అనుకోని కుదుపు. వ్యాపారంలో నష్టాలతో శ్రీధర్ కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. అప్పులు పెరిగిపోయాయి. శ్రీధర్ దంపతులు అపురూపంగా కట్టుకున్న ఆ పొదరింటిని అమ్ముకోవలసి వచ్చింది. ఆ ఇంటిని కొనుక్కున్నవాళ్ళు, నెలరోజులు గడువు ఇచ్చారు ఇల్లు ఖాళీ చేయడానికి.వేరే ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా, దివ్యను వేరే స్కూల్లో చేర్పించాలన్నా అప్పటికప్పుడు కనీసం ఓ యాభైవేలైనా కావాలి.
ఇల్లు అమ్మిన విషయం తెలియగానే, ఐనవాళ్ళు, స్నేహితులు ముఖం చాటేశారు. దాంతో శ్రీధర్, జ్వాల దంపతులు అవసరానికి చేయూతలేక, డబ్బు అందక ఇరకాటంలో పడిపోయారు.ఆఖరి ప్రయత్నంగా ఊర్లో ఉన్న తమ దూరపు బంధువులు తనకి అక్క వరుసయ్యే సుగుణకు ఫోన్‌చేసింది జ్వాల. తమ కుటుంబం ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితి గురించిచెప్పి, సహాయం చెయ్యమని అర్థించింది. తన కూతురు కాన్పుకి వచ్చిందనీ, తాను స్వయంగా రాలేనని, తన భర్త భుజంగరావుతో డబ్బులు పంపిస్తాననీ తీపి కబురు చెప్పింది సుగుణ.