బొబ్బిలి-పార్వతీపురం మధ్య ట్రాక్ ఇన్‌స్పెక్షన్.రైల్వే ట్రాక్ మీద మోటార్ ట్రాలీ పరిమిత వేగంతో వెళ్తోంది. పైన ఎర్ర జెండా రెపరెపలాడుతోంది.ఆ సెక్షన్‌లో రైల్వేట్రాక్ రెన్యూవల్ వర్క్‌ను మోటర్‌ ట్రాలీలో ఇన్స్పెక్ట్ చేస్తున్నాడు సీనియర్ రైల్వే డివిజనల్ ఇంజినీర్ చంద్ర మౌళి. ఆయన ఖరగ్ పూర్ నుంచి కొత్తగా బదిలీ మీద వచ్చాడు. మధ్యలో సీతానగరం స్టేషన్ యార్డ్ నీ, బ్రిడ్జ్ నీ ఇన్స్పెక్ట్ చేసి, లైన్‌క్లియర్ తీసుకుని, పార్వతీపురంబెలగాం స్టేషన్‌కి బయల్దేరాడు. మోటార్ ట్రాలీ నర్సిపురం హాల్ట్ దాటింది. అల్లంత దూరంలో బెలగాం స్టేషన్ ఔటర్ కనిపిస్తోంది. కుడివైపు అడ్డాపు శిల కొండ, ఎడమ వైపు బోడికొండ దూరం నుంచి పలకరించాయి. వాటిని చూడగానే చంద్రమౌళికి చిన్నప్పుడు బెలగాం హైస్కూల్లో ఆరో క్లాసు గుర్తుకొచ్చింది. ఆదినారాయణ గుర్తుకొచ్చాడు.

బెలగాం హైస్కూల్.. ఆరో తరగతి ‘ఎ’సెక్షన్...సంక్రాతి సెలవల తర్వాత స్కూల్ తెరిచారు. ఫస్ట్ పీరియడ్ క్లాస్ టీచర్ డేవిడ్ మాస్టారు వచ్చారు. హాఫ్ ఇయర్లీ ఆన్సర్ పేపర్లు తీసుకొచ్చారు. తన పేరు పిలిచారు. తెలుగు,ఇంగ్లిష్, లెక్కలు,సైన్స్, సోషల్ స్టడీస్. అన్నిట్లో తనే ఫస్ట్. ‘‘వెరీ గుడ్ చంద్రమౌళీ..కీపిట్ అప్..’’ అన్నారు. ఆ తర్వాత ‘‘ఒరేయ్ ఆదినారాయణా’’ అని గట్టిగా పిలిచారు. చివరి వరసలోని ఆదినారాయణ మెల్లగా ముందుకు వచ్చాడు. ఒక్క సబ్జెక్ట్ లో పాసు మార్కులు వస్తే ఒట్టు! ఆదినారాయణ వీపు మీద నాలుగు అంటించి, వాడి ఆన్సర్ పేపర్ల చివర్లో ఏం రాశాడో చూపించి భళ్ళుమని నవ్వారు డేవిడ్ మాస్టారు.

ప్రతీ ఆన్సర్ పేపర్ చివర్లోనూ మూడు అక్షరాలు- ‘మీ దయ’ అని రాసి ఉన్నాయి. వాటిని చూసి పిల్లలందరూ నవ్వారు. మౌళి జాలిపడ్డాడు. ఆదినారాయణ తలదించుకున్నాడు. మరో మూడు నెలల తర్వాత పెద్ద పరీక్షలు వచ్చాయి. ఆదినారాయణ ఆరో తరగతి ఫెయిల్ అయ్యాడు. మౌళి ఏడో తరగతి లోకి వెళ్ళినా ఆ ఇద్దరి స్నేహం కొనసాగింది. మోటార్ ట్రాలీ లో వెళ్తున్న సీనియర్ డివిజనల్ ఇంజునీర్ చంద్రమౌళి కి ‘మీ దయ’ గుర్తుకొచ్చింది. ‘‘పూర్ ఫెలో..’’ అనుకున్నాడు. నవ్వుకున్నాడు