ముప్పైయేళ్ళుగా తన ఇంట్లో ఉంటూ తనను సాకి ఆయా అమ్ములు. ఈరోజు ఆమె వైద్యం లభించక ఏకాకిగా ఇంట్లో మిగిలిపోయిందని తెలియగానే, వేలకిలోమీటర్ల దూరం నుంచి రెక్కలు కట్టుకుని ఆమె ముందు వాలిపోయాడతను. ఆమె కోలుకోవాలని, తిరిగి మామూలు మనిషవ్వాలని ఎంతో తపించిపోయాడు. అయితే తన కన్నతల్లి చూపిస్తున్న నిరాదరణనే జీర్ణించుకోలేకపోయాడతను. అతడి తల్లి ఎందుకు నిరాదరణ చూపించింది?

********************************

తెల్లవారుఝాము మూడుగంటలవుతోంది.నిద్రమాత్ర వేసుకుని పడుకుందేమో నిద్రగాఢతవల్ల మెలకువ రాలేదు సుజాతకి. వాల్యూం తగ్గించి దూరంగా టేబుల్‌మీద ఉంచిన మొబైల్‌ఫోన్‌ ఎంతసేపటినుంచీ మోగుతోందో తెలియదు. చీమచిటుక్కుమంటే లేచే కమలాకర్‌ కూడా ఆ రోజు లేవలేదు.‘ఈ టైములో ఫోన్‌చేసిందెవరబ్బా! వేళాపాళా లేకుండా’ అనుకుంటూ మెల్లగాలేచి ఫోను అందుకుని ‘హలో’ అంది సుజాత వెనక్కువచ్చి బెడ్‌మీద కూర్చుంటూ.‘‘త్వరగా తలుపు తీయమ్మా’’ అంటూ సుపరిచతమైన గొంతు. సుజాతకి నిద్రమత్తు పూర్తిగా వదల్లేదు. మాట్లాడుతున్నదెవరో అర్థంగావడం లేదు.‘అరవింద్‌ గొంతులా ఉంది. వాడీవేళ ఎందుకు ఫోన్‌ చేస్తాడు? అనుకుంటూనే ‘‘అరవింద్‌ నువ్వేనా? తలుపు తీయడమేమిటి? నాతోనే మాట్లాడుతున్నావా లేక అక్కడ కోడల్నిగానీ తలుపు తీయమంటున్నావా? నాకేమీ అర్థం కావడంలేదు’’ అంది సుజాత మగతగా.

‘‘అమ్మా నేనే, అరవింద్‌నే మాట్లాడుతున్నా హైదరాబాద్‌ వచ్చాను. మనింటిగుమ్మంముందు నిలబడి మాట్లాడుతున్నా. అర్జంటుగా తలుపు తీయకపోతే గుమ్మం బయటే పడకేస్తాను. తరువాత నీ ఇష్టం’’ అన్నాడు అరవింద్‌ నవ్వుతూ.‘‘చెప్పాపెట్టకుండా ఏమి సర్‌ప్రైజులో ఏమిటో?’’ అనుకుంటూ,‘‘ఏవండీ, చినబాబు వచ్చాడు లేవండీ’’ అంటూ నిద్రపోతున్న కమలాకర్‌ని తట్టిలేపి నాలుగు అంగల్లో గుమ్మం దగ్గరకు చేరుకుని, ‘‘అరవింద్‌ నువ్వేనా?’’ అని కన్ఫర్మ్‌ చేసుకుని తలుపు తీసింది సుజాత. చేతిలో సూట్‌కేసు పక్కనపెట్టి బ్యాక్‌ప్యాక్‌ తీయకుండానే తల్లిని రెండుచేతులతో గువ్వలా హత్తుకున్నాడు ఆరడుగుల అరవింద్‌.

********************************

ఆస్ర్టేలియానుంచి హైదరాబాద్‌ వచ్చిన ఒక్కగానొక్క కొడుకు అరవింద్‌తో మాట్లాడుతూ ‘‘వచ్చి రెండురోజులైంది. వారంరోజుల్లో మళ్ళీ తిరుగుప్రయాణమంటున్నావు. ఉన్న రెండురోజులైనా ఇంటిపట్టున ఉన్నావా అంటే అదీలేదు, పొద్దుననంగా వెళ్లినవాడివి రాత్రికి తిరిగి వచ్చావు. ఇంతవరకు ఇంట్లో భోజనం చేయలేదు’’ అని అరవింద్‌తో నిష్ఠూరంగా అని, ‘‘ఇక ఉండే వారంరోజులు ఆఫీస్‌ పని వంకతో బెంగళూరు వెళతానని వాడు బయలుదేరుతుంటే మీరేమీ మాట్లాడారేమిటండీ’’ అని బాధగా అంటూ, అసహనంగా భర్తచేతిలో న్యూస్‌పేపర్‌ లాగి కిందపడేసింది సుజాత.