‘‘నేనెప్పుడు చనిపోవాలో ఈరోజు తెలుస్తుంది!’’ముప్పిరిగొన్న ఉద్విగ్నత నడుమ తన గదిలో పచార్లు చేస్తున్నాడు సుకృత్.‘ఒకవేళ చనిపోవడానికి తను ఒప్పుకోకపోతే?’ అంతలోనే అనుమానం.‘నోనో! గేమ్‌రూల్స్ ఒప్పుకోవు. చనిపోవడానికి తనుఒప్పుకోవాల్సిందే’ తనలోనే సమాధానం.సాయంత్రం ఆరు దాటుతోంది.
‘అమ్మానాన్నలు ఆఫీసు నుంచి వచ్చేలోపే 26వ లెవల్ టాస్క్ ముగించాలి’ - సుకృత్‌లో పట్టుదల. కానీ... తను మరణించే తేదీని తెలుసుకునే టాస్క్ కావడంతో కాళ్లు వణుకుతున్నాయి. నోరు తడారిపోతోంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. తల బరువెక్కుతోంది. మరు నిమిషంలో మెదడు నరాలు చిట్లిపోతాయేమోనన్నంత బాధ! అయినా ఆడాలన్న పట్టుదల. టాస్క్ పూర్తి చేయాలన్న తపన.చుట్టూ ఉన్న ప్రపంచమంతా అదృశ్యమైపోయి... తనొక్కడే ఇంకేదో లోకంలో ఉన్నట్లు, ఎవరి చేతనో నియంత్రించబడుతున్న మరబొమ్మలా, ఒక ఉన్మాదక్షేత్రంలో చిక్కుబడిపోయాడు.నెల రోజుల క్రితం తల్లిదండ్రులకు తెలియకుండా ‘బ్లూ వేల్’ గేమ్ ఆడటం మొదలుపెట్టాడు. వాళ్లిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు.
ఒక్కగానొక్క కొడుకుని ఖరీదైన కార్పొరేట్ స్కూల్లో చేర్పించారు. లోటు లేకుండా చూసుకోవాలన్న ప్రేమతో అన్నీ సమకూర్చారు. ఏడో తరగతిలోనే స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు.సుకృత్ ఇప్పుడు ఎనిమిది చదువుతున్నాడు. నాలుగ్గంటలకే స్కూలునుంచి ఇంటికొచ్చి, ఓ గంటసేపు ఇంట్లో ఒంటరిగా ఫోనులో రకరకాల ఆటలు ఆడేవాడు. ఆ క్రమంలోనే ఫేస్‌బుక్ ఫ్రెండు ద్వారా బ్లూ వేల్ ఊబిలో దిగబడ్డాడు.ఆటలో భాగంగా తెల్లవారుజామునే నిద్రలేచి భయంకరమైన వీడియోలు చూశాడు. బ్లేడుతో చేతుల మీద గాట్లు పెట్టుకున్నాడు. తిమింగలం బొమ్మ చెక్కుకున్నాడు. పెదవిని కోసుకున్నాడు. చేతుల మీద గుండుసూదులతో గుచ్చుకున్నాడు. అదే ఆటాడుతున్న మరో కుర్రాడితో స్కైప్‌లో మాట్లాడాడు.
క్యురేటర్ సూచనల మేరకు పనిగట్టుకుని మరీ ‘బాధ అనిపించే పనులు’ చేసి, నీరసపడిపోయేవాడు.ఇట్లా, దాదాపు పాతిక స్థాయిలు పూర్తి చేశాడు.ఈ విషయాలేవీ తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు.26వ లెవల్ టాస్క్ ఆడటానికి సిద్ధమయ్యాడు సుకృత్.‘‘మార్చి 22. ఆరోజు నువ్వు మరణించబోతున్నావు. ఎత్తయిన బిల్డింగు మీది నుంచి దూకి, ఆత్మహత్య చేసుకోబోతున్నావు...’’ఆ సూచన అందుకోగానే సుకృత్ కుప్పకూలిపోయాడు.ఫఫఫగుంటూరు. జిల్లా స్థాయి ఖోఖో ఫైనల్స్.ఆట రసపట్టులో ఉంది. రెండు నిమిషాల్లో ముగ్గుర్ని అవుట్ చేస్తేనే ఆత్మకూరు జడ్పీ హైస్కూలు గెలుస్తుంది. అది అసాధ్యమని అప్పుడే అవతలి జట్టు సంబరాలు మొదలెట్టింది. కడకు విజయం తమ జట్టుదేనన్న ధీమాతో కోర్టు బయట నిలబడ్డారు కృష్ణమూర్తి.