పొద్దు వాటారుతున్న ఆ వేళ, ఎగిసి లేస్తున్న గోధూళిది నీలి ఆకాశాన్ని అందుకునే ప్రయత్నం. ఉరకలేస్తూ గోవులు వాటి వెనుకనే గోపాలకుల రాకతో నందగోకులం వీధులన్నీ సందడి నింపుకున్నాయి.‘‘ఎళ్లనా అయ్యా ... అదే రేపటి పున్నమి రాత్రి ... ’’ చావిడి స్తంభానికి చేరగిలి నిల్చున్న పదిహేనేళ్ళ శ్రావణి తండ్రి సమాధానం కోసం ఆతృతగా చూసింది.వీధి అరుగు మీద కూర్చుని ఆవు దూడకి చిక్కం అల్లుతున్న తండ్రి ఆమె మాట పూర్తి కాక ముందే తలెత్తి చూశాడు. తీగలాంటి శరీరం - పల్చని అమాయకమైన మొహం - ‘నా కూతురింకా చిన్నది’ అనుకున్నాడు. తిరిగి చిక్కం అల్లుతూ చెప్పాడు. ‘‘ఇప్పుడొద్దులే అమ్మా! మళ్ళీ నెల పెళ్ళి పనులంటూ అత్తమ్మ ముందుగానే వొస్తుందాయే! ఆమెతో కలిసి వెళ్దువుగానీలే’’ కాదనకుండా కాదన్న తీరు ఈసారికి.ఇంతకు మునుపు కూడా తండ్రి నుండి అభ్యంతరాలు అనేక రూపాల్లో వచ్చాయి. చిన్న పిల్లవి తల్లీ! అనో - తల్లి లేనిదానివమ్మా! అనో - పెళ్లి కావలసిన పిల్లవనో. తీరా మళ్ళీ వచ్చే పౌర్ణమికి ఏ కారణం చెపుతాడో కదా ఈతండ్రి!నిరాశని సన్నని నిట్టూర్పులో కప్పి పుచ్చుతూ తమ్ముడికేసి చూసింది. ఆవు దూడ మెడ చుట్టూ చేతులు వేసి ఆడుతున్న పద మూడేళ్ళ చంద్రుడు ఇదేమీ పట్టనట్లే వున్నాడు.మగపెళ్లివారికి స్వయంగా ఆహ్వాన పత్రికలు ఇచ్చేందుకు తండ్రి చిన్నాయనతో కలిసి మరుసటి రోజున పక్క ఊరికి వెళ్తున్నాడు. రాత్రికి అక్కడే చెల్లెలి ఇంట వుండి ఆ మర్నాడే తిరిగి రావడం. లోన మెత్తని గడ్డి పరిచి, పూల దండలతో అలంకరించబడిన బండి ఓ పక్కగా నిలిచి వుంది. మువ్వలు కూర్చిన కొత్త గంట లతో ముస్తాబైన గిత్తల జంట - మరుసటి రోజు ప్రయాణానికై ఇంటి పట్టునే వుండి విశ్రాంతి తీసుకుంటున్నాయి. పెళ్లి వారింటికి తీసుకువెళ్ళాల్సిన పిండి వంటలు, ఆహ్వాన పత్రికలు మధ్య సావిడీలో పేర్చి వున్నాయి.ఇంటి వెనుకకి చేరి, ఆలమందల కోసం నీళ్ళు తోడి పోసి - వెదురు బద్దలా సాగి వెన్ను సవరించుకుంది శ్రావణి. గాలి విసురుకి వల్లెవాటు కొంగు తెరచాపలా పైకి లేచి సుడి తిరిగింది. అదుపు చేసుకునే ప్రయత్నంలో తల పైకెత్తి నీలిమేఘాలను చూసి ఉలిక్కిపడింది. రేపటి రోజున కాకపోతే ఇక కుదిరేదెప్పుడు? పెళ్ళయి ఈ ఇంటి గడప దాటి పరాయి ఊరికి చేరిందంటే మరింక ఈ బృందావనం కలలో కూడా ఊహించుకునే అవకాశం రాదు. ఆ నల్లనయ్య వేణుగానం, గోపికల నృత్యం ఈ జన్మకి చూసే అవకాశం తనకి లేదేమో! దిగులు కమ్ముకుంది.

                                     *************************************************