ఎప్పుడో పాతికేళ్ళప్పుడు ఇంటిపెరట్లో నాటిన మామిడిచెట్టు ఎండిపోయి మోడుబారిపోయింది. దాన్ని కొట్టేద్దామని, కిచెన్‌రూంలో అటకపైనున్న గొడ్డలి తీసుకుని హాల్లోకి వచ్చాను. చెన్నై నుంచి వచ్చిన నా బాల్యమిత్రుడు భాస్కర్ అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టాడు.
‘‘ఏం భాస్కర్ బాగున్నావా? రా..కూర్చో’’ అంటూ సోఫా చూపించి, నేను ఎదురుగా ఉన్న చైర్‌లో కూర్చున్నాను.‘‘బాగున్నాం’’ అంటూ సోఫాలో కూర్చున్నాడు.‘‘రమా! చెన్నై నుంచి మీ భాస్కర్ అన్న వచ్చాడు. టీ పట్టుకురా’’ అని కేకేశాను.అంతవరకు బెడ్‌రూంలో పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్న నా శ్రీమతి రమాదేవి వెలుపలికి వచ్చి ‘ఏమన్నా బాగున్నారా?’’ అని పలకరించి వంటింట్లోకి వెళ్ళింది.‘‘ఆఁ బాగున్నామమ్మా’’ అని ఆమెకు సమాధానం చెప్పి, ‘‘ఏదో పని మీదున్నట్లున్నావ్?’’ నా చేతిలోని గొడ్డలిని చూస్తూ అడిగాడు భాస్కర్.‘‘ఏం లేదు, పెరట్లో మామిడిచెట్టు మోడుబారిపోయింది. కొమ్మలెప్పుడో కొట్టేశాను. నాలుగడుగుల మోడుంది. అడ్డమెందుకు కొట్టేద్దామని గొడ్డల్ని తీసుకున్నాను. ఇంతలో నువ్వొచ్చావ్’’ అన్నాను.
‘‘మనిషికి ఎంతో మేలుచేసే మామిడిచెట్టును కొట్టేయడం ఎందుకు?’’‘‘మోడుబారిపోయింది కదా!’’‘‘ఎంత మోడుబారినా లోపల సత్తా ఉంటుంది. మనం మొదుల్లో పాది ఏర్పాటుచేసి నీళ్ళు పోసి, కాస్తా శ్రద్ధ తీసుకుంటే చాలు. నిదానంగా మళ్ళా చిగుళ్లేసి, పెద్ద చెట్టుగా తిరిగి పెరుగుతుంది’’.విద్యార్థికి పాఠ్యాంశం బోధించే ఉపాధ్యాయుడిలా చెప్పాడు భాస్కర్.‘‘సరే! ఇంతకీ చెన్నై విశేషాలేమిటి?’’ అడిగాను.‘‘నా కొడుకు చెన్నైలోనే సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు కదా!’’‘‘అవును’’‘‘వాడికి పెళ్ళి కుదిరింది’’అని చెబుతుంటే, అంతలో నా శ్రీమతి రమాదేవి తెచ్చిన టీ ని ఇద్దరం చెరో కప్పు తీసుకున్నాం.