‘జవసత్వాలు ఉన్నంతకాలం మనిషి అహోరాత్రాలు తన కుటుంబం కోసమే కష్టపడి ఓ యంత్రంలా పనిచేస్తాడు. అప్పడు సమాజం, దాని శ్రేయస్సు గుర్తుకురావు. ఆ పనిచేసే యంత్రం కాస్తా అరిగి కరిగి మరమ్మత్తుకు వచ్చినప్పుడు ఆ కుటుంబసభ్యులే ఎంత త్వరగా దాన్ని వదిలించుకుందామా అని చూస్తారు’.‘‘రామనాథంగారూ! రామనాధంగారూ!’’ సిస్టర్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది సుజాత. తల్లి పద్మావతి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతోంది. తండ్రిని జబ్బపుచ్చుకుని జాగ్రత్తగా లేపి నిలబెట్టింది.
‘‘నడవగలవా నాన్నా? వీల్ చైర్ తీసుకురానా?’’ అడిగింది సుజాత.‘నడవగలను’ అన్నట్టు సౌంజ్ఞ చేశాడు రామనాథం. సుజాత రామనాథాన్ని నెమ్మదిగా డాక్టర్ రూంలోకి తీసుకువెళ్ళింది. లోపలికి వెళ్ళగానే డాక్టర్‌గారికి నమస్కారం చేసి, రామనాథాన్ని డాక్టర్‌గారి పక్కనే ఎత్తుపీట మీద కూర్చోపెట్టింది.‘‘ఎలా ఉన్నారు?’’ డాక్టర్ వంశీ నవ్వుతూ అన్నారు. ఆ నవ్వు మొహం చూశాక రామనాథానికి కాస్త ధైర్యం వచ్చింది. నెమ్మదిగా తన సమస్యలు ఏకరువు పెట్టాడు.‘‘ఓ.కె! ఓ.కె! నో ప్రోబ్లం. ఇక రేడియేషన్ ఆపేద్దాం. పౌష్టికాహారం బాగా తీసుకోండి. మందులు మారుస్తాను’’ అన్నారు డాక్టర్.
రామనాథం తల ఊపాడు. సుజాతకు పరిస్థితి అర్ధమవుతూనే ఉంది.‘‘ఇంకా ఎన్నాళ్ళు సార్?’’ అంది పద్మావతి అసహనంగా. డాక్టర్ ఏమీ మాట్లాడలేదు. ఆమె అడిగేదేమిటో ఆయనకు తెలుసు. మొహంలో చికాకు కనిపించనివ్వకుండా, ‘‘ముందు మీరు ఆయన్ని తీసుకువెళ్ళి బయట కూర్చోండి’’ అన్నాడు పద్మావతితో.‘‘నువ్వు ఉండమ్మా మందులు మార్చి రాసి ఇస్తా’’ అని సుజాతకు చెప్పి ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు డాక్టర్ వంశీ.డాక్టర్ తనప్రశ్నకు సమాధానం చెప్పకపోవడంతో, పద్మావతి రామనాథాన్ని బలంగా, వేగంగా బయటకు లాక్కుంటూ తీసుకువెళ్ళి రోగులు కూర్చునే కుర్చీల్లో కూర్చోబెట్టింది.