అతను‘‘జీవిస్తూ ఉండగానే ప్రేమ దొరకాలిప్రేమిస్తూ ఉండగానే జీవితం దొరకాలి’’- ఇమ్రోజ్‌జీవితంలో అనుకున్నవీ, ఆశపడినవీ... ఒక్కటి కూడా జరగకుండా ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ ఉండక తప్పదనీ, ఇది తెలుసుకోవడానికి బతకాలని అర్థమవ్వటమేనా జీవితమంటే?ఇలా ఆమె, రోజులో ఎన్నిసార్లు అనుకుంటుందో, గుండె తలుపులోంచి లోపలికి, చీకట్లోకి జ్ఞాపకాల్లోకి ఎన్నిసార్లు అలా వెళ్ళిపోతుంటుందో అతనికి తెలుసు.‘‘నీకిప్పుడు గుర్తొచ్చింది కేవలం నా జీవిత మేనా లేక నీది కూడానా’’ అని అతనుఆమెను అడిగితే ‘ఏమో’ అనే సమాధానమిస్తుంది కదూ అనుకున్నాడు. ఇరవై ఏళ్ళ జీవితం సాదాసీదాగా గడిచిపోయాక ఉన్నట్టుండి ఆమె జీవితంలోకి అతను చొరబడ్డాక, ఎంత ఆనందం కలిగిందో అంతకు మించిన విషాదం ఆమె మనసుని ఎందుకు ఆవరించుకుందో అతనికి అర్థంకాలేదు.ఇప్పుడు అతను మాసిన గోడలు, నీళ్లొలికిన గ్లాసుల గుండ్రటి మరకల టేబుల్‌ ముందు కూర్చుని ఉన్నాడు. సరిగ్గా ఇలాగే, ఇదేస్థలంలో కొన్ని నెలల కిందట కూర్చున్న జ్ఞాపకం అతని మనసులో మెదిలింది. ఆరోజు అతనితోపాటు ఇదే టేబుల్‌ ముందు ఇతను కూడా కూర్చున్నాడు. ఆరోజు కూడా బార్‌లో ఎక్కువ మంది లేరు. ఏదో పనిచేసి పెట్టినందుకు పార్టీ ఇస్తానంటే ఇలా వచ్చాడు అతను.బస్టాండ్‌ సెంటర్లోని బార్‌లో మేడ మీద గదిలో కూర్చోని టేబుల్‌ మీద గ్లాసు పైకెత్తి పెద్ద సిప్‌ చేసిన ఇతడిని అలాగే చూశాడు అతను.వాళ్ళిద్దరిదీ ఒకే వయసు. ఆమెకి తాళికట్టిన భర్త ఇతను. ‘‘ఇద్దరికీ పెళ్ళై ఇరవైఏళ్ళు దాటినా భౌతికంగా, మానసికంగా ఇతనికన్నా నేనే నీకు దగ్గర’’ అని అతను ఆమెతో అన్నప్పుడు ‘‘సర్లే.. ఇంకేంటి’’ అని ఆమె ఎప్పుడూ అనడం గుర్తొచ్చింది అతనికి.సగం ఖాళీ అయిన విస్కీ, నీళ్ళు, గ్లాసులూ.. అన్నీ సగం వరకే ఉండటం అతనికెందుకో విచిత్రంగా అనిపించింది.ఎదురుగా కూర్చున్న ఇతను షర్ట్‌ జేబులోంచి ఫోన్‌ తీసి స్ర్కీన్‌ మీద ఫోటోని ఒకసారి చూసి మళ్లీ ఆఫ్‌ చేయడం గమనించాడు అతను. అందులో ఆమె, చిన్నోడు ఉంటారని తెలుసు. అయినా అప్పుడు అతని గుండె కలుక్కుమంది.

                                                   ***********************************************************