ముకుందుడి జబ్బురచనః వసుంధరపూర్వం ఒకానొక గ్రామంలో ముకుందుడు, గోపాలం అనే ఇద్దరు మిత్రులుండేవారు. ఇద్దరూ సమవయస్కులు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. ఇద్దరికీ ఓ కొడుకూ, కూతురూ. ఇద్దరికీ వారి వారి తలిదండ్రులు వారితోనే ఉంటున్నారు. ఇద్దరి సంసారాలూ ఏ కలతలూ లేకుండా సుఖశాంతులతో వర్థిల్లుతున్నాయి.ముకుందుడి తండ్రి రవీంద్రుడిది పాలవ్యాపారం. వారి ఇంట పది పాడి ఆవులూ, పది పాడి గేదెలూ ఉన్నాయి. రవీంద్రుడికి నిజాయితీ పరుడైన వ్యాపారిగా చుట్టుపక్కల మంచి పేరుంది. ఇప్పుడు ముకుందుడు అదే పాలవ్యాపారం చేస్తూ తండ్రి పేరు నిలబెడుతున్నాడు.గోపాలం తండ్రి శ్రీపాలంది మిఠాయి వ్యాపారం. ఆయన పాలతో రకరకాల తీపి పదార్థాలు తయారు చేసి అమ్మేవాడు. పదార్థాలు రుచిగా, శుచిగా చేస్తాడని ఆయనకు పేరు. ఇప్పుడు గోపాలం కూడా అదే వ్యాపారం చేస్తూ తండ్రి పేరు ఎంతలా నిలబెట్టాడంటే - అతడి వంటకాలకు పట్నంనుంచి కూడా గిరాకీ వచ్చింది. ఐతే అతడెన్నడూ పట్నం వెళ్లలేదు, చూడలేదు. రోజూ కొందరు పట్నంనుంచి వచ్చి, గోపాలంవద్ద తిను బండారాలు కొని తీసుకుని వెడుతూంటారు.గోపాలం తనకు కావలసిన పాలన్నీ ముకుందుడి వద్దనే కొంటాడు. వారి స్నేహానికి వారి వ్యాపారాలూ పెద్ద కారణం. గోపాలం తయారుచేసే తినుబండారాల రుచిని ముకుందుడు మెచ్చుకుంటాడు. ముకుందుడు అమ్మే పాల నాణ్యతను గోపాలం మెచ్చుకుంటాడు.వాళ్లు వయసులోనే కాదు. కుటుంబ పరిస్థితిలోనే కాదు. వ్యాపారాభివృద్ధిలోనూ, మంచి మనసులోనూ కూడా సరిసమానులని ఊళ్లో అంతా వాళ్ల గురించి చెప్పుకునేవారు. ముప్పై ఏళ్లొచ్చేదాకా - ముకుందుడూ, గోపాలం అన్నింటా సరిసమంగా ఉన్నారు. అప్పుడు ముకుందుడి జుట్టు ఉన్నట్లుండి తెల్లబడడం మొదలైంది. అంత చిన్న వయసులో తలపై నెరిసిన జుట్టు ఉండడం ముకుందుడికి నచ్చలేదు. అతడు రాజశేఖరుడు అనే వైద్యుడి వద్దకు వెళ్లి, తన జుట్టు నల్లబడడానికి మందివ్వమని అడిగాడు.'జుట్టు నల్లబడాలంటే రంగు వేసుకోవాలి తప్ప, వేరే మందు లేదు. అయినా, ఏదో ఒక వయసులో అందరికీ జుట్టు తెల్లబడుతుంది. నీకు కాస్త ముందు మొదలయిందంతే! ఈ మాత్రం దానికి బెంగ అనవసరం' అన్నాడు రాజశేఖరుడు. 'జుట్టు తెల్లబడడం వృద్ధాప్య లక్షణం. నేను తొందరగా ముసలి వాడినై పోతున్నానని బెంగగా ఉంది' అన్నాడు ముకుందుడు.