ఉదయభానుని లేత కిరణాలు కిటికీ ద్వారా లోపలికి ప్రవేశించి తట్టిలేపడంతో బద్ధకంగా కళ్ళు విప్పి గడియారం వైపు చూశాను.ఆరు గంటలు దాటింది.ఆదివారమే కదా! మరి కాస్సేపు పడుకుందామని మంచంపై అటూ ఇటూ దొర్లుతూ చేసిన ప్రయత్నం వృథాయే అయ్యింది.ఇక లాభం లేదు. నిద్ర పట్టేట్లు లేదని, లేచి పెరటివైపు నడిచాను.
అమ్మ వంటింట్లో కాఫీకి డికాషన్ తయారుచేస్తోంది. నాన్న వాకింగ్‌కి వెళ్లినట్లున్నారు. సందడి లేదు. చెల్లెళ్లిద్దరూ ఇంకా ముసుగుతన్ని పడుకుని ఉన్నారు.బ్రష్‌మీద పేస్ట్ వేసుకుని పెరట్లోకి నడిచాను. రోజూ ఆ టైంలో నోట్లో బ్రష్‌తో ప్రత్యక్షమయ్యే నన్ను చూసీ చూసీ అలవాటుపడ్డ మొక్కలు, చిన్నగా తలాడిస్తూ స్వాతగం పలికాయి. మంచు బిందువులతో బరువెక్కి అరవిరిసిన గులాబీలు ముగ్ధమనోహరంగా ఉన్నాయి.గన్నేరు, మందారం, గరుడవర్థనం చెట్లు – నిండా విరగబూసిన పూలతో కనువిందు చేస్తున్నాయి. వాటిని తనివితీరా చూస్తూ దంతధావనం ముగించాను.టవల్‌తో ముఖం తుడుచుకుంటుంటే ‘‘గుడ్ మార్నింగ్ అమ్మాయ్’’ అంటూ పెరటి గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు బాబాయ్.‘‘శుభోదయం బాబాయ్! వాకింగ్ పూర్తయిందా?’’ అన్నాను నవ్వుతూ విష్ చేస్తూ.
‘‘ఆఁ అయింది. అబ్బ! పెరడంతా విరబూసినపూలతో, ఎంత అందంగా ఉందో! నిజంగా ప్రకృతి అంత అందమైన కాన్వాస్ ఇంకోటి లేదు. భగవంతుడంత గొప్పచిత్రకారుడు వేరొకరు లేరు. అన్నట్లు...ఈ రోజు ఏం జరిగిందో తెలుసా?’’ అన్నాడు బాబాయ్ ఉత్సాహంగా.‘‘పద! లోపల కూర్చుని మాట్లాడుకుందాం’’ అన్నాను. ఇద్దరం హాల్లోకి వెళ్లి సోఫాలో కూర్చున్నాం.‘‘ఇప్పుడు చెప్పు బాబాయ్’’ అన్నాను.‘‘ఈరోజు మా చిన్నాడి పరీక్షా ఫలితాలు వస్తున్నాయి కదా! అందుకని దేవుడికి దండం పెట్టుకుందామని నేనూ, మీ నాన్న వాకింగ్ పూర్తవుగానే దారిలో ఉన్న ఆంజనేయస్వామి గుళ్లోకెళ్లాం.