1999 జనవరి 1ప్రపంచం నవశకం వైపు తల ఎత్తుకుని చూస్తుంటే ...అమ్మాయిగా పుట్టిన నేను మాత్రం పాత సంప్రదాయాల్ని నా భుజంపై మోస్తూ, ఆ బరువుకి కుంగిపోతూ, అంతకుమించి ఏమీ చేయలేని నా చేతకానితనానికి తల వంచుకుంటే.. ఇంట్లోవాళ్లు మాత్రం దాన్ని ‘సిగ్గు’ అనుకున్నారు.
నాకిది ఎన్నో పెళ్లిచూపులో గుర్తు లేదు. చేదు జ్ఞాపకాల్ని నెమరేసుకునే శక్తి, ఓపిక దేవుడు నాకివ్వలేదు. అందుకే ఇదివరకే ఆయనకు లెక్కలేనన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నాను.ఎందుకో మొట్టమొదటిసారి నా ఇల్లే నాకు పరాయిలా అనిపిస్తోంది. ఆ ఇరుకింట్లో, పరీక్ష హాల్లో విద్యార్థిలా కూర్చున్నా నేను. నా చుట్టూ అందరూ ఇన్విజిలేటర్లే, నన్ను చూసుకోవడానికి వచ్చిన ఆ అబ్బాయితో సహా!ఇక్కడ గమ్మత్తేంటంటే పరీక్ష రాయాల్సిన నేను రిలాక్డ్స్గానే ఉన్నా.. పాపం, అమ్మా నాన్నలే.. ఈసారైనా తమ కూతురు పాసవుతుందో, లేదో అని బిక్కుబిక్కుమంటూ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.ఫలహారాలతో పాటు రొటీన్ ప్రశ్నలన్నీ అయిపోయాయి.మార్కెట్లో అప్పుడే ఫ్రెష్షుగా వచ్చిన చేపని చూసి ‘ఇంటికెళ్లి పులుసు పెట్టుకోవాలా? ఫ్రై చేసుకోవాలా?’ అంటూ ఆశగా చూస్తారే.. అలా చూస్తున్నాడతగాడు.
అబ్బాయిల చూపులతో మా అమ్మాయిల శీలాలకొచ్చిన ముప్పు లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ప్రతీసారీ నా క్వాలిఫికేషన్‌తో పాటు కన్యత్వాన్ని కూడా నిరూపించుకోవాల్సి వచ్చేది.మగాళ్లు బయటకు వస్తూ వస్తూ కంట్లో టేపులు, మనసులో స్కానర్లు దోపుకు వస్తారో ఏమో తెలీదు గానీ, అమ్మాయి ఎదురవ్వగానే చూపులతో కొలతలు మొదలెట్టేస్తారు. ఆ కళ్లు దేన్ని వెదుకుతున్నాయో, ఆ మనసు లోలోపల ఎన్ని వికృతమైన దృశ్యాలకు వ్యూహ రచన చేస్తోందో ఊహించుకోగానే నాలో వికారం మొదలైపోయింది.పెళ్లివాళ్లు వెళ్లిపోయారు.
యుద్ధానికి ముందుండే నిశ్శబ్దం, యుద్ధం అయిపోయాక మిగిలే శ్మశాన వైరాగ్యం.. రెండూ కట్టకట్టుకుని మా ఇంట్లోనే ఊరేగుతున్నాయి.‘‘ఇంతకీ ఏమంటారు?’’ అమ్మలో బెంగ.‘‘ఏముంది.. మామూలే..’’ నాన్నలో నైరాశ్యం.అంటే... మళ్లీ నేను ఫెయిలన్నమాట. నాలో ఎలాంటి ఫీలింగూ లేదు.మనుషుల్ని చంపడం అలవాటైన క్రిమినల్కీ, పెళ్లిచూపుల పేరుతో ప్రతిసారీ మనసుల్ని చంపుకోవడం అలవాటు చేసుకున్న నాలాంటి అమ్మాయిలకీ ఎలాంటి ఫీలింగ్సూ ఉండవేమో?