వినాయక చవితి సందర్భంగా వీధికవతల వైపు మండపం కట్టి గణపతి ప్రతిమని పెట్టారు. రోజూ రాత్రి పొద్దుపోయే దాకా ఏవో సాంస్కృతిక కార్యక్రమాల పేర, సినిమాల్లోని భక్తి పాటలతో హోరెత్తుతోంది మా వీధి. జనాదరణ పొందిన సినిమా పాటల బాణీల్లో భక్తి చొప్పించి రాసిన పాటలు కూడా మైకుల్లో వీర విహారం చేస్తున్నాయి. ఆ మైకుకి విశ్రాంతి దొరికితేనే మాకు నిద్ర.
ఆలస్యంగా పడుకున్నానేమో ఓ పట్టాన మెలకువ రాలేదు. కాలింగ్ బెల్ చప్పుడుకి బద్ధకం వదిలించుకుని వీధి తలుపు తెరిచాను. కడిగిన ముత్యంలా నవ్వుతూ లోపలికొచ్చింది ముత్యాలు. గడియారం చూస్తే సరిగ్గా ఆరు. ఇంత ఖచ్చితంగా ఎలా వస్తుందో, ప్రతిరోజూ అదే సమయానికి!కాఫీ డికాక్షన్ కోసం నీళ్లు పెట్టబోతుంటే, ‘‘ఏందమ్మా .. నిన్న మళ్లీ డిన్నరుకెళ్లిర్రా?’’ ఎడమ చెయ్యి నడుమ్మీద పెట్టి, కుడి చేతిని గడ్డం కింద పెట్టుకుని, భృకుటి ముడేసి చూస్తూ అంది. అప్పటికి వదిలింది నిద్ర మత్తు. సింకులో గిన్నెల్లేవుకదా, అదన్నమాట తన అనుమానం.‘‘లేదులే, తర్వాత చెప్తా గాని ముందు ఇల్లు ఊడ్చి తుడిచెయ్. ఈలోపు మెషిన్లో బట్టలేస్తా’’ అన్నాను. అనుమానంగా నన్ను చూస్తూ తలుపు పక్కనే గట్టుకింద పొందిగ్గా కూర్చున్న కొత్త వస్తువుని కళ్లతో పట్టుకుంది. ‘‘ఇదేందమ్మ కొత్తదేదో కొన్నట్టున్నవ్?’’ అంది.
అత్తా, ఆడబిడ్డల పోరు లేదు గాని ఈమెకి వణికి చస్తున్నా అనుకున్నా. అదేమిటో చెప్పాలంటే మాటలు దొరకలా. ‘‘చెప్తాలే ఇల్లు ఊడ్చిరా. పొద్దు పొద్దున్నే ముచ్చట్లు’’ విసుక్కున్నట్టు నటించా. ముత్యాలు ఓ చూపు విసిరేసి, చీపురు, చాట తీసుకుని ఊడవడానికి వెళ్లింది.ముత్యాలుదీ నాదీ పదిహేనేళ్ల అనుబంధం. అప్పట్లో చెన్నై నుంచి హైదరాబాద్కి బదిలీ మీద వచ్చాం. అక్కడ సోఫాలూ, కుర్చీలూ, భోజనాల బల్లతో సహా వస్తువులన్నీ అమర్చిన ఇల్లు కావడంతో ఇక్కడికొచ్చాక అన్నీ కొనుక్కోవలసి వచ్చింది. పిల్లలిద్దరూ చిన్నవాళ్లు. కొత్తచోట సరైన పనిమనిషి దొరక్క, వీధి చివర ఉన్న ఖాళీ జాగాలో వాచ్ మాన్గా ఉంటున్న రంగయ్యని అడిగాను. మర్నాడే అతని కోడలు ముత్యాలు పనికి వచ్చింది. నిగనిగ మెరుస్తున్న ఆరోగ్యవంతమైన చర్మం. ముక్కుకి తెల్లగా మెరుస్తున్న ఒంటిరాయి ముక్కుపుడక. తెల్లని పలువరస. సందిగ్ధంగా, సంకోచంగా ఉన్న తన తీరు చూసి ‘‘ఇంటిపని అలవాటుందా?’’ అనడిగా.