మనిషి తన మానవత్వాన్ని నిలబెట్టుకోవాలనీ, అందుకోసం జాలి, కరుణ, ప్రేమ, దయ, జీవవైవిధ్య రక్షణ వంటి గుణాల్ని కాపాడుకోవాలని మహనీయులేనాడో చెప్పాడు. ఈ లక్షణాలవల్లనే మనకి జంతుస్థాయి పోయి, ‘మనిషితనం’ అబ్బిందని శాస్త్ర పరిశోధకులూ చెప్పారు. కానీ ఈ మనిషితనాన్ని నిలబెట్టుకునేదెంతమంది? ఈ కథలో అభంశుభం ఎరగని సత్య ఎలా ఆలోచించింది? ఏం చేసింది?
************************
వీధి అరుగుమీద కూర్చుని మంగవంక దిగులుగా చూస్తోంది పదకొండేళ్ళ సత్య. ఇంటి ముందున్న ఖాళీస్థలంలో పూలమొక్కలమధ్య గింజలేరుకుంటూ, ఒక్కో గింజను తన ముక్కుతో పొడుస్తూ తింటోంది మంగ. తను పెంచుకుంటున్న కోడిపిల్లపేరు మంగ. నలుపు, తెలుపు ఈకల కలయికతో చూడముచ్చటగా ఉంటుంది మంగ. సంక్రాంతికి అమ్మమ్మ గారింటికెళ్ళినప్పుడు తెచ్చుకుంది ఆ కోడిపిల్లను. నిజానికి తెచ్చుకున్నప్పుడు పిల్లేగాని ఇప్పుడు బాగా పెద్దదై నవనవలాడుతోంది. అప్పటినుంచీ ఎంతో ప్రేమగా పెంచుకుంటోంది మంగను.ఉదయం లేచిన వెంటనే దానికి గింజలుపెట్టి, నీళ్ళు తాగించి పెద్ద పురికొసను కాలికికట్టి స్వేచ్ఛగా ఇంటిముందున్న ప్రదేశంలో తిరిగేటట్టుగా ఆ రెండో కొసని ఓ చెట్టుకి కడుతుంది ఎక్కడికీ పోకుండా. ఆ ప్రదేశమంతా కొన్ని గింజల్ని జల్లుతుంది. మంగ పురికొస పరిధిలో ఉన్న ఆ ప్రదేశమంతా కలియదిరుగుతూ ఒక్కొక్క గింజా ఏరుకుని తింటూ ఉంటుంది. స్కూలుకెళ్ళేముందు సత్య కాసేపు మంగతో ఆడుకుంటుంది. స్కూలుకెళ్ళాక కూడా మంగగురించే ఆలోచిస్తుంది ఎలాఉందోనని. స్కూలు కెళ్ళేముందు తల్లితో పదేపదే చెబుతుంది మంగను జాగ్రత్తగా చూసుకోమని. ‘‘అలాగేలేవే’’ అని నవ్వుతూ అనేది తల్లి.కానీ వారం రోజులనుంచీ వాతావరణం మారిపోయింది. అలా మారిపోవడానికి సత్య తండ్రి రామదాసే కారణం. ఇక్కడ రామదాసు గురించి కొంత చెప్పుకోవాలి.రెండువేలమంది జనాభావున్న ఆ గ్రామంలో రామదాసు ఓ చోటా రాజకీయనాయకుడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటూ పబ్బంగడుపుకుంటూ వుంటాడు.
ఆ ఊరు పంచాయతీ మాజీ వార్డుమెంబరు కూడా. పైరవీలు చేసుకుంటూ ఎంతోకొంత సంపాదించు కుంటూ బతికేస్తుంటాడు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, కోడిపందాల నిర్వహణలో రామదాసుదే ప్రముఖపాత్ర. ఇప్పుడూ అదే పాత్ర. పోలీసులిచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు కాబట్టి అతడిని జైల్లో పెట్టారు. అలా జైలుకెళ్ళిరావడం రామదాసుకి కొత్తేమీకాదు. ఏదోఒక గొడవలో అప్పుడప్పుడు అలా జైలుకెళ్ళడం అతనికి అలవాటే. రామదాసుకి తాత తండ్రులిచ్చిన ఆస్తిని పేకాటలోనూ, కోడిపందాల్లోనూ పెట్టి పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్నచోటే తిరిగి సంపాదించాలని కంకణంకట్టుకుని పనీపాటా చెయ్యకుండా వాళ్ళ దగ్గర ఏదోరకంగా డబ్బులు కొట్టేసి బతుకుబండి లాక్కొస్తున్నాడు. అతని భార్య సుబ్బలక్ష్మి భర్తకు ఎదురుచెప్పలేక గుట్టుగా సంసారం లాక్కొస్తోంది. వాళ్ళకి ఒక్కర్తే కూతురు సత్య. ఆ పిల్లను వాళ్ళు చాలా గారాబంగా పెంచుకుంటున్నారు. కూతురంటే ప్రాణం రామదాసుకి. జైల్లో వున్న మూడునెలలూ అక్కడపెట్టిన చిప్పకూడు తినీ తినీ అతడి నాలుక చచ్చుబడిపోయింది. ఇంటికి వచ్చిన వెంటనే అతని కళ్ళు ఇంటిముందు తిరుగుతున్న మంగమీద పడ్డాయి. నవనవలాడుతున్న మంగను చూస్తుంటే అతని నోట్లో నీళ్ళూరాయి.