‘‘నా సామిరంగా చూడ్రా! ఎలా త్తళత్తళ పెళపెళ లాడిపోతోందో, కొత్త సినిమా హీరోయిన్ లాగా!’’ అంటూ అతను నన్ను రెండుచేతులతోనూ పైకెత్తి పట్టుకున్నాడు. నావైపే చూస్తున్నాడు.‘‘అవునన్నా నీ చేతుల్లో మెరిసిపోతోంది’’ అన్నాడు అతని పక్కనున్నవాడు.అలా వాళ్ళిద్దరూ నా అందం గురించి మాట్లాడుకుంటుంటే నాకు తెగ సిగ్గేసింది.
ఇంతలో అతను చటుక్కున నన్ను ముద్దుపెట్టేసుకున్నాడు. ‘అబ్బ! ఏదో కంపు భరించ లేనంత!’ అతని దగ్గర.వెంటనే నన్ను తన అసిస్టెంటుకి ఇస్తూ, ‘‘ఇదిగోరేయ్! అప్పారావ్, దీన్ని తీసుకెళ్ళి మన బంగారంకొట్టు సేటుగాడి చేతిలోపెట్టు. ఆడి దుకాణం నుండి బయటకు వెళ్ళిందా మనకి బోణీ బాగున్నట్టే’’.‘‘అలాగే అన్నా’’ అంటూ అప్పారావు నన్ను సగానికి మడతేసి తన జేబులో పెట్టుకున్నాడు.‘‘ఓరి తింగరినాయాలా, ఇది దొంగనోటని ఆడికి సెప్పకు. సూద్దాం, ఈ శాంపిలు మార్కెట్లోకి వదిలి సేటుకి కూడా ఏ అనుమానం రాకుండా సెలామణి అయిపోయిందా, ఇంక వరస బేచులు దింపేయచ్చు’’.అలా అతని చేతిలో పుట్టీ, అప్పారావు చేతులమీదుగా సేటు కొట్టుకు చేరుకున్నాను.
సేటు నన్ను రెండు చేతులతో ఎత్తి పట్టుకుని చూస్తూ, ‘‘ఏం భాయ్. ఇది మీ బాపతు నోటు కాదుకదా!’’ అన్నాడు.‘‘ఏటామాట? మన బాపతు అను బాగుంటది. నువ్వేటి మాకన్నా వేరేటి? అయినా ఇంకా కొత్త బేచు మొదలెట్టలేదు’’‘‘సర్లేవోయ్, ఏదో అన్నాన్లే, ఇంద చిల్లర’’ అంటూ వందనోట్లు ఒక ఐదు ఇచ్చాడు సేటు.‘‘నోటు అనుమానం లేకుండా చూసుకో సేటూ, మల్లా నన్నంటావు’’ రెట్టించాడు అప్పారావు.‘‘సర్లే, చూసా, చూసా, నువ్వెళ్ళు త్వరగా. అదిగో ఆ హెడ్ కానిస్టేబుల్ రాజారావు వస్తున్నాడు. నిన్ను కానీ ఇక్కడ చూసాడంటే...’’ అంటూ అప్పారావుని పంపించేసి నన్ను తన టేబుల్కున్న క్యాష్ డ్రాయర్లో పడేశాడు. అక్కడ నాకు అంతా కొత్తగా ఉంది. నాలాంటివేకాక చాలారకాల నోట్లు ఉన్నాయి.